చండూరు ఎంపీపీపై అవిశ్వాసానికి సిద్ధం

చండూరు, వెలుగు : చండూరు ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్‌‌ఎస్‌, బీజేపీ ఎంపీటీసీలు సిద్ధమయ్యారు. ఇక్కడ ఎంపీపీ పల్లె కల్యాణి రవికుమార్‌‌తో కలిపి11 మంది సభ్యులు ఉండగా, వైస్ ఎంపీపీ మందడి నరసింహారెడ్డి (సీపీఐ) ఇటీవల మృతి చెందారు. ప్రస్తుతం పదిమంది సభ్యులు ఉండగా.. ఏడుగురు బీఆర్ఎస్ , ముగ్గురు బీజేపీ సభ్యులు.  ఎంపీపీ మినహాయిస్తే ఆరుగురు బీఆర్ఎస్, ముగ్గురు బీజేపీ సభ్యులు సోమవారం అడిషనల్ కలెక్టర్ కుష్బూ గుప్తాకు తీర్మానం కాపీని అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ఎంపీపీ ఒంటెద్దు పోకడలతో తమను పట్టించుకోవడం లేదని,  అభివృద్ధికి సహకరించడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు అవ్వారు గీత, చెరుపల్లి భాస్కర్,  సత్తయ్య, చేపూరి యాదయ్య, తిప్పర్తి లక్ష్మమ్మ, పెందోటి వెంకటమ్మ, కావలి మంగమ్మ, పల్లె వెంకన్న, నాతాల వనజ ఉన్నారు.