గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేయండి: డిప్యూటీ సీఎం భట్టి

గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేయండి: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, వెలుగు: గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద కొన్ని గ్రామాలను ఎంపిక చేయాలన్నారు. రైతుల వ్యవసాయ పంపు సెట్లకు ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పవర్‎ను ఏర్పాటు చేయాలని సూచించారు. దీని ద్వారా వచ్చే విద్యుత్‎ను పవర్ గ్రిడ్‎కు కనెక్ట్ చేయాలన్నారు. మింట్ కాంపౌండ్​లోని ఎస్పీడీసీఎల్ ఆఫీస్‎లో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి, వివిధ వర్గాలకు ఆదాయం సమకూర్చడంపై అధికారులతో భట్టి సమీక్ష నిర్వహించారు.

 ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘‘ప్రతి ఏటా సోలార్ పవర్ ద్వారా రైతులకు నిర్ధిష్టంగా ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయండి. ఎంపిక చేసిన గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఇండ్లకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పవర్ సెట్‎లను ఏర్పాటు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లితో పాటు మధిర నియోజకవర్గంలోని సిరిపురంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా 20 గ్రామాలను ఎంపిక చేయాలి’’అని భట్టి అన్నారు.

బై బ్యాక్ పద్ధతిలో కొనుగోలు 

ఎంపిక చేసిన స్వయం సహాయక సంఘాలకు ఐదు నుంచి పది మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పెట్టుకోవడానికి ప్రోత్సహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ‘‘సోలార్ పవర్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడానికి స్వయం సహాయక గ్రూప్ సభ్యులకు బ్యాంకు నుంచి లోన్లు ఇప్పించాలి. సోలార్ పవర్ ప్లాంట్ల నుంచి వచ్చే కరెంట్‎ను ప్రభుత్వమే బై బ్యాక్ పద్ధతిలో కొనుగోలు చేస్తది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్​ సభ్యులను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి ఎంతో దోహదపడ్తది’’అని భట్టి అన్నారు.