తెలంగాణ యూనివర్సిటీ లో అక్రమాల ప్రక్షాళనకు సిద్ధం

  • వీసీ  అక్రమాలపై ఆధారాలతో విద్యార్థి సంఘాల ఫిర్యాదు
  • పర్మిషన్​ లేకుండా రిజిస్ట్రార్​ల మార్పుపై ఉన్నత విద్యామండలి సీరియస్​

నిజామాబాద్,  వెలుగు: తెలంగాణ యూనివర్సిటీ లో అక్రమాల ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది.  వైస్​చాన్స్​లర్​ రవీందర్​గుప్తా అక్రమాలపై ఆధారాలతో సర్కార్​కు ఉన్నత విద్యామండలి రిపోర్ట్​ఇచ్చింది. దీంతో వీసీపై వేటు పడే అవకాశమున్నట్లు యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. వీసీ అక్రమాలపై టీచింగ్, నాన్​టీచింగ్​ సిబ్బంది, విద్యార్థి సంఘాలతోపాటు వర్సిటీ పాలకవర్గం సర్కార్​కు ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్​ 17 న జాతీయ జెండా ఆవిష్కరణకు వీసీ గైర్హాజరు కావడాన్ని సర్కార్​ సీరియస్​గా పరిగణించింది. ఈ క్రమంలో వీసీ కొన్నిరోజులుగా లాంగ్​లీవ్​పై వెళ్లారు. 

అన్ని వైపుల నుంచి ఫిర్యాదులు 

టియూ వీసీ రవీందర్​గుప్తా  వ్యవహారంపై అన్ని వైపుల నుంచి ఉన్నత విద్యామండలి, ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ప్రధానంగా విద్యార్థి సంఘాల ఫిర్యాదులు, ఆందోళనలను సర్కార్​ సీరియస్​గా పరిగణిస్తోంది. 14 నెలల కిందనే వీసీగా నియమితులైన రవీందర్​గుప్తా టీయూలో ఔట్​ సోర్సింగ్​ నియామకాలు, ఫండ్స్​ దుర్వినియోగం , కొనుగోళ్లు, పాలన కార్యకలాపాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి.  పాలకమండలి ప్రమేయం లేకుండానే ముగ్గురు రిజిస్ట్రార్​లను మార్చడంతో వివాదం నెలకొంది.  మూడు నెలలక్రితం రిజిస్ట్రార్​గా పనిచేసిన శివశంకర్​గౌడ్​కు అవార్డు రాగా వర్సిటీలోని ఓ ప్రొఫెసర్​ఆయనను సన్మానించారు. దీనిపై ఆ ప్రొఫెసర్​కు వీసీ చీవాట్లు పెట్టడం వివాదస్పదంగా మారింది.  మరోవైపు వీసీ వచ్చిన కొత్తలో రిజిస్ట్రార్​గా మొదట కనకయ్యను మార్చి యాదగిరిని నియమించారు. ఆ తర్వాత ఆయనను మార్చి శివశంకర్​ గౌడ్​కు బాధ్యతలు అప్పగించారు. అనంతరం శివశంకర్ ​స్థానంలో విద్యావర్ధినిని నియమించారు. ఈ మార్పులపై ఈసీ మండలిలో చర్చించకపోవడం గమనార్హం. నెల రోజుల క్రితం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగా మొదలైన రచ్చతో వీసీ అక్రమాలు బయటపడ్డాయి. వర్సిటీ పరిధిలోని కాలేజీల నుంచి వసూళ్ల దందాపై ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.  ఆధారాలతో సర్కార్​కు నివేదిక సమర్పించారు.  జాబ్స్​ నుంచి రిజిస్ట్రార్, పీఆర్ వో మార్పులపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో పాలకమండలి వీసీ తీరుపై ఆగ్రహంగా ఉంది. 

లాంగ్​లీవ్​లో వీసీ 

వైస్​చాన్స్​లర్​ రవీందర్​గుప్తా వారం రోజులుగా లాంగ్​లీవ్​లో ఉన్నారు. ప్రభుత్వం వేటు వేయడానికి ముందే లీవ్​పై వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉన్నతాధికారులే  లీవ్​ పెట్టాలని వీసీని ఆదేశించినట్లు సమాచారం. టీయూలో విద్యార్థి సంఘాల ఆందోళనలకు బ్రేక్​ వేసేందుకు వీసీ మార్పు మినహా ప్రత్యామ్నాయం కనిపించడంలేదు. వీసీపై చర్యలు చేపట్టనున్నట్లు ఉన్నత విద్యామండలి అధికారి ఒకరు వెల్లడించారు. రెండు రోజుల్లోనే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.