- జనగామ జిల్లాలో 171 సెంటర్లు
- కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య
జనగామ, వెలుగు: వానాకాలం సీజన్ వడ్ల కొనుగోళ్లకు సర్వం సిద్ధం చేశామని జనగామ కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య చెప్పారు. ఒకటి, రెండు రోజుల్లో సెంటర్లు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కొనుగోలు సెంటర్ల సిబ్బందికి బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ట్రైనింగ్ క్లాస్‌లకు అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్‌తో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఐకేపీ ఆధ్వర్యంలో 79, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 92 మొత్తం 171 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లో 2.30 లక్షల టన్నుల వడ్ల దిగుబడి రానుందని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేసినట్లు తెలిపారు. వడ్ల కొనుగోళ్లకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వడ్ల క్వాలిటీని పరిశీలించిన తర్వాత రైతులకు టోకెన్లు ఇస్తామని, వాటి ప్రకారమే కొనుగోళ్లు నిర్వహించాలని ఆదేశించారు. అవసరమైన గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
ALS0 READ: సెకండ్ లిస్ట్ టెన్షన్ బీజేపీ, కాంగ్రెస్‌లో ఉత్కంఠ
సెంటర్ల వద్ద టాయిలెట్స్, తాగునీరు, విద్యుత్, ఎలక్ట్రానిక్ యంత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన వడ్లు వెంటనే మిల్లులకు తరలించేందుకు హమాలీలు, లారీలను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. కొనుగోళ్లపై ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఉంటుందని, హెల్ప్‌లైన్ నంబర్ 63039 28718 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చన్నారు. సమావేశంలో డీఆర్డీవో మొగులప్ప, డీఎస్‌వో రోజా రాణి, డీఎం ప్రసాద్, డీఎంవో నరేందర్‌రెడ్డి, ఏపీడీ నూరుద్దీన్ పాల్గొన్నారు.