హైదరాబాద్: ఫోర్త్ సిటీని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కాలుష్య రహితంగా ఉంటుందని అన్నారు. 2050 వరకు హైదరాబాద్ సిటీ అవసరాలకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పారిశ్రామిక వేత్తలు కలిసి వస్తే అద్భుతాలు సృష్టిద్దామని పిలుపునిచ్చారు. హైటెక్ సిటీలోని సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్‌లో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి మాట్లాడారు. హైదరాబాద్‌లో ఫోర్త్ సిటీని నిర్మించాలని నిర్ణయించుకున్నామన్నారు.
న్యూయర్క్ , లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ వంటి నగరాలతో ఫోర్త్ సిటీ పోటీ పడుతుందని చెప్పారు. ఇది దేశంలోనే గొప్ప నగరంగా ఉండబోతోందని అన్నారు. కాలుష్య రహిత నెట్ జీరో సిటీగా చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీలో 3,200 ఈవీ బస్సులను తీసుకువస్తున్నామన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్డు పన్నును తొలగించామని చెప్పారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి హైదరాబాద్ సిద్ధమవుతోందని, వరదలు లేని నగరంగా తీర్చిదిద్దాలనుకుంటున్నామని అన్నారు. మూసీ పునరుజ్జీవంతో 55 కిలోమీటర్ల మేర మంచినీరు ప్రవహిస్తుందని అన్నారు.
ALSO READ | ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ అంటే ఇదీ : టికెట్ 5 వేల రూపాయలా..!
హైదరాబాద్‌ను చైనాకు ప్లస్ సిటీగా మార్చే వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఓఆర్ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌ను అనుసంధానించే రేడియల్ రోడ్లు నిర్మించబోతున్నామని వెల్లడించారు ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ మధ్య ప్రాంతం మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రంగా ఉండబోతుందని చెప్పారు. నైపుణ్యాలు, ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించామని అన్నారు. రాష్ట్రానికి తీరప్రాంతం లేనందున డ్రైపోర్టు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. దీనిని బందరు పోర్టుతో అనుసంధానం చేస్తామని చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాలని ,మార్కెట్లు స్వేచ్ఛగా పనిచేయాలని మేము కోరుకుంటున్నామని సీఎం చెప్పారు.