పులి ఉనికి అడవికి అందం, రక్ష!

పులి ఉనికి అడవికి అందం, రక్ష!

పులి అడవి సంపన్నతకు ప్రతీక. నడకలో రాజసం, వేటలో గాంభీర్యం ప్రదర్శించే ఈ జంతువు.. ఆహార గొలుసులో అగ్రస్థానంలో ఉంటూ మిగతా జంతువులు, జీవుల జనాభాను పరోక్షంగా నియంత్రిస్తుంది. ప్రత్యక్షంగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది. పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని కాపాడటంలో పులి పాత్ర కీలకమైనది. పులుల ఉనికి అడవికి అందం, రక్ష. అడవిలో వాటి సంఖ్యను బట్టే పర్యావరణ సమతుల్యతను అంచనా వేయొచ్చు. పులులు అంతరించిపోతే వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుంది. ఉదాహరణకు మారిషస్‌‌‌‌లో డోడోస్ పక్షులు అంతరించిపోవడంతో ఒక జాతి అకేసియా చెట్టు పునరుత్పత్తి ఆగిపోయింది. ఒక జాతి అంతరించిపోయినప్పుడు, దాని ప్రభావం మరోదానిపై పడుతుంది. అందుకే పులులను రక్షించాల్సిన అవసరం ఏర్పడింది. 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్‌‌‌‌బర్గ్ లో టైగర్ సమ్మిట్‌‌‌‌ జరిగింది. 13 దేశాల ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. 2022 నాటికి పులుల జనాభాను రెట్టింపు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి పులులను రక్షించుకోవాల్సిన అవసరాన్ని చాటిచెప్తూ ఏటా జులై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. పులిని, అటవీ ఆవరణ వ్యవస్థతో కలిపి రక్షించుకోవడం మానవ సమాజాల అవసరం.

ఎందుకు అంతరిస్తున్నాయ్

చెట్లను, దట్టమైన అడవులను నరికి పులుల ఆవాసాలను నాశనం చేయడం, పులుల చర్మం, గోర్ల కోసం వేట, అక్రమ వ్యాపారం లాంటి ప్రధాన కారణాల వల్ల పులుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. భారత ప్రభుత్వం 1973 ఏప్రిల్​1న టైగర్​ప్రాజెక్టును చేపట్టి పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా 3,820 పులులు ఉంటే, ఇండియాలోనే 2,967 ఉన్నట్లు అంచనా. పులుల సంరక్షణ వాటి గణనకు సంబంధించి జాతీయ పులుల సంరక్షణ, సాధికారిక సంస్థ(ఎన్​టీఎస్ఏ)ను ప్రభుత్వం 2005లో ఏర్పాటు చేసింది. ప్రతి నాలుగేండ్లకోసారి పులుల గణన చేపడుతున్నారు. దేశంలో మధ్యప్రదేశ్​ రాష్ట్రంలో అత్యధికంగా 526 పులులు ఉన్నాయి. అందుకే అక్కడ 6 టైగర్​ రిజర్వులు ఏర్పాటు చేశారు. పులులు పెద్ద సంఖ్యలో చనిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఎన్​టీఎస్ఏ తాజా లెక్కల ప్రకారం.. గత పదేండ్లలో 1,059 పులులు చనిపోయాయి. దేశవ్యాప్తంగా నిరుడు 127 మృతి చెందితే, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 75 మృతిచెందాయి. 2012 నుంచి 2020 మధ్యలో అత్యధికంగా మధ్యప్రదేశ్​లో 202 పులులు చనిపోగా, మహారాష్ట్ర141, కర్నాటక123, ఉత్తరాఖండ్ 93, అస్సాం 60, తమిళనాడు 62, యూపీ 44, కేరళలో 45 పులులు చనిపోయాయి. పులులు పిల్లల్ని కంటున్నా.. అనువైన ఆవాసాలు లేకపోవడం తదితర కారణాల వల్ల అవి బతకడం లేదు. పుట్టిన15 నెలల్లోనే 70 శాతం వరకు చనిపోతున్నట్లు పలు అధ్యయ నాలు చెబుతున్నాయి. దేశంలో 3000 పులులు ఉన్నాయనుకుంటే  ఏటా 1500 పిల్లలు పుడితే.. ప్రతి పదేండ్లకు పిల్లల సంఖ్య పది వేల నుంచి 15 వేలకు పెరగాలి. కానీ వాస్తవ పరిస్థితి అలా లేదు. ఎన్ టీఎస్ఏ లెక్కల ప్రకారం 2012–2022 మధ్య పదేండ్ల కాలంలో పులులు పెరగకపోగా వెయ్యికి పైగా మృత్యువాతపడటం గమనార్హం. 

మరింత శ్రద్ధ అవసరం

పులుల సంరక్షణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత శ్రద్ధ పెట్టాలి. అడవులను పెంచుతూ పులుల ఆవాసాలను కాపాడాలి. వేటగాళ్లు, అక్రమ వ్యాపారంపై ఉక్కుపాదం మోపాలి.  ఇప్పటికే బాలి టైగర్, కాస్పియన్ టైగర్, జావాన్ టైగర్ తదితర టైగర్ జాతులు అంతరించిపోయాయి.. ఇప్పటికైనా మేల్కొనకపోతే పులులు పూర్తిగా అంతరించి పర్యావరణ, జీవవైవిధ్య వ్యవస్థ కుప్పకూలుతుంది. వన్యప్రాణులు, ఇతర అరుదైన జంతువులను రక్షించేందుకు అభయారణ్యాలు ఏర్పాటు చేస్తారు. తెలంగాణలో 9 రిజర్వ్​ఫారెస్టులున్నాయి. వాటిల్లో కవ్వాల్ అభయారణ్యాన్ని 2012లో టైగర్​ రిజర్వ్​గా ప్రకటించారు. ఆమ్రాబాద్ అభయారణ్యా(నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్​ప్రాజెక్టు)​న్ని 1983లో పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు. దేశంలోనే దీన్ని అతిపెద్ద టైగర్​ రిజర్వ్​గా పేర్కొంటారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పులుల సంఖ్య కొంత ఆశాజనకంగానే ఉన్నా.. వాటి సంరక్షణకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఫారెస్ట్​ ఎకో సిస్టమ్​ బాగుంటుంది.