- పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి
హైదరాబాద్ సిటీ, వెలుగు: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కంకల్ గ్రామంలో చెల్లాచెదురుగా పడి ఉన్న దాదాపు 50కి పైగా చారిత్రక శిల్పాలను పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. స్థానికులు సంపత్‌కుమార్, సింహాద్రి వెంకటరామిరెడ్డితో కలిసి గ్రామంలోని పురాతన శిల్పాలను సోమవారం ఆయన పరిశీలించారు. బాదామీ చాళుక్యుల నాటి నిలువెత్తు గణేశుడు, నంది శిల్పాలు, రాష్ట్రకూటుల కాలపు జైన పార్శ్వనాథ, మహావీర, యక్ష, యక్షిణి శిల్పాలు, కల్యాణి చాళుక్యుల కాలానికి చెందిన నాగదేవతలు, కాకతీయుల సప్తమాతృక, వీరుల శిల్పాలు, రెండు శాసనాలు రక్షణ లేకుండా ఉన్నాయన్నారు.
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు, వికారాబాద్ జిల్లాలోని ఎల్లకొండతో పాటు కంకల్ కూడా వెయ్యేళ్ల నాటి దిగంబర జైనక్షేత్రమన్నారు. అందుకు ఈ శిల్పాలే నిదర్శనమని చెప్పారు. జైన, శైవ మతాలకు చెందిన ఇన్ని శిల్పాలున్న కంకల్ను హెరిటేజ్ విలేజ్‌గా ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మల్లేశ్, నీరటి రాములు, చిన్నికృష్ణ, శివాలయ పూజారి పాల్గొన్నారు.