రిజర్వేషన్ల స్ఫూర్తిని కాపాడాలె

సామాజికంగా వెనకబడిన వర్గాలను ఉన్నత స్థానాలకు తీసుకొచ్చేందుకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. కానీ ఈ రోజుకీ అది సాధ్యం కాలేదు. రిజర్వేషన్ల ఫలాలు అందని వర్గాలు ఇంకా ఉన్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్లలో కొత్త సంస్కరణలు అవసరం. ఇప్పటి దాకా సామాజికంగానే అందుతున్న రిజర్వేషన్లను, ఈడబ్ల్యూఎస్​ రూపంలో ఆర్థికంగా వెనుకబడిన వారికీ వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల స్థితిగతులు, వారి జనాభా ప్రకారం రిజర్వేషన్లలో మార్పులు జరగాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్లు ఇప్పటివి కావు. ఛత్రపతి సాహు మహారాజ్ తొలిసారిగా1902 జులై 26న వెనుకబడిన వర్గాల(ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల) వారికి తన కొల్హాపూర్ సంస్థానంలో విద్య , ఉద్యోగ రంగాల్లో 50 శాతం రిజర్వేషన్స్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఆ రోజును ‘రిజర్వేషన్స్ డే’ గా పరిగణిస్తారు. 

50 శాతం రిజర్వేషన్లు

రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు ఇచ్చిన సాహు మహరాజ్.. వాటిల్లో కీలక అంశాలు పేర్కొన్నారు. ‘‘అన్ని తరగతుల వారికి విద్యను ప్రోత్సహించడానికి కొల్హాపూర్ రాష్ట్రాల్లో ఇటీవలి సంవత్సరాల్లో ప్రయత్నాలు జరిగాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన ఆ ప్రయత్నాలు వెనుకబడిన వర్గాల విషయంలో ఆశించిన విజయాలను సాధించలేకపోయాయి. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాక ప్రభుత్వం ఉన్నత విద్యకు తగినంత  ప్రోత్సాహకాలు ఇవ్వలేదనే నిర్ణయానికి వచ్చింది. దీన్ని కొంత మేరకు పరిష్కరించడానికి, రాజ్యంలో ఉన్నత ప్రమాణాలను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు ప్రోత్సాహం కల్పిస్తుంది. ఈ వర్గాలకు ఎక్కువ ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం వారికి సేవల్లో, ఉద్యోగాల్లో పెద్ద మొత్తం వాటా రిజర్వ్ చేయాలని నిర్ణయించింది. తన పాలసీని అనుసరించి ప్రభుత్వం ఈ ఆర్డర్ తేదీ నుంచి 50 %  వెనుకబడిన తరగతుల నుంచి ఖాళీల భర్తీ చేపడుతుందని ఆదేశిస్తుంది. వెనుకబడిన తరగతులు అంటే.. బ్రాహ్మణులు, ప్రభువులు, వ్యాపారులు(వైశ్యులు), పార్సీలు, ఇతర ఆధునిక కులాలు మినహా ఇతర కులాలు అని అర్థం చేసుకోవాలి” ఆ రోజు ఆయన జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు.

గవర్నర్​కు లేఖ రాస్తూ..

ఛత్రపతి సాహు మహారాజ్ 1917లోనే అప్పటి బొంబాయి మాజీ గవర్నర్‌ లార్డ్ సిడెన్ హామ్ కు రిజర్వేషన్లపై లేఖ రాశారు. ఆ లేఖలో అప్పటి అగ్రవర్ణాల కుట్రలను, కుతంత్రాలను, అరాచకాలను, నీతి బాహ్యమైన విధానాలను వివరించారు. అప్పటికి రాబోయే ‘భారత ప్రభుత్వ చట్టం1919’ ద్వారా దేశంలోని సాధారణ ప్రజలకు చట్ట సభల్లోనూ, ప్రభుత్వ ఉద్యోగాల్లో కింది కులాల వారందరికీ కనీసం 20 ఏండ్లు రిజర్వేషన్స్ కల్పించాల్సిన అవసరం ఉందని రాశారు. దేశమంతా కింది కులాల వారికి రిజర్వేషన్స్ ఎందుకు అవసరమనే దాన్ని వివరిస్తూ... తన కొల్హాపూర్ సంస్థానంలో ఏ పరిస్థితుల మధ్య తాను రిజర్వేషన్స్ కల్పించాల్సి వచ్చిందో పేర్కొన్నారు. ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత ఉండాలని చెబుతూ కుల ప్రాతిపదికన జనాభాను బట్టి రిజర్వేషన్స్ కల్పించాలని విన్నవిస్తాడు. దేశంలోని బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, రక్షణ కోసం అప్పటికి దేశంలో అగ్రవర్ణాల కుట్రలను ఎదుర్కొని పోరాడుతున్న ఏకైక పాలకుడిగా ఆయన నిలిచారు.  సాహు మహారాజ్ రిజర్వేషన్స్ కల్పించి 120  ఏండ్లు నిండింది. ఆయన శతవర్ధంతి(1922–2022)  సందర్భంగానైనా రిజర్వేషన్ భావన స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతున్న చర్యలను వ్యతిరేకించాలి. బీసీలు, విద్య, ఉద్యోగ , చట్ట సభల్లో తమ వాటా ప్రకారం రిజర్వేషన్స్ సాధించేందుకు పోరాటం ఉధృతం చేయాలి.  

-  ఇట్యాల వెంకటకిషన్,
తహసీల్దార్