- అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవడంపై బైడెన్ కామెంట్
- ఏబీసీ న్యూస్‌కు స్పెషల్ ఇంటర్వ్యూ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకునేది లేదని ప్రెసిడెంట్ బైడెన్ తేల్చిచెప్పారు. డెమోక్రాట్ల తరఫున ప్రెసిడెంట్ ఎలక్షన్ లో ‘పోటీ చేసేది నేనే.. గెలిచేది నేనే’ అంటూ ధీమా వ్యక్తం చేశారు. దేవుడు దిగొచ్చి ‘జో, ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకో’ అంటే బరిలో నుంచి తప్పుకుంటానని, అయితే, దేవుడు దిగిరాడని బైడెన్ పేర్కొన్నారు.
ఈమేరకు శుక్రవారం ఏబీసీ న్యూస్ టీవీకి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ప్రెసిడెంట్జో బైడెన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల సమయంలోనూ తాను గెలవడం కష్టమేనని అందరూ అభిప్రాయ పడ్డారని గుర్తుచేస్తూ.. ఈసారి కూడా ట్రంప్ ను ఓడిస్తానని నమ్మకంగా చెప్పారు. ఇక, తన ఆరోగ్యంపై వ్యక్తమవుతున్న సందేహాలను ఆయన తేలిగ్గా తీసిపారేశారు. డిబేట్ జరిగిన రాత్రి తీవ్ర అలసట వల్ల స్వల్ప అస్వస్థతకు లోనయ్యానని చెప్పుకొచ్చారు. జ్ఞాపకశక్తికి సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకోవాలన్న డిమాండ్లను బైడెన్ తోసిపుచ్చారు.
రోజువారీ వ్యవహారాలలో తాను తన మెదడుకు పరీక్ష పెట్టుకుంటూనే ఉంటానని, ఇది నిరంతరం చేస్తున్నానని తెలిపారు. అధ్యక్ష పదవికి తనకన్నా సమర్థుడు మరొకరు లేరని బైడెన్ పేర్కొన్నారు. ప్రెసిడెన్షియల్ రేసు నుంచి బైడెన్ తప్పుకోవాలంటూ సొంత పార్టీ నేతలే డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలపైనా ఆయన స్పందించారు. పార్టీలో తనతో ఎవరూ ఈ విషయాన్ని ప్రస్తావించలేదని స్పష్టం చేశారు.