గట్టిగా నిలబడదాం.. అమెరికన్లకు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భరోసా

గట్టిగా నిలబడదాం.. అమెరికన్లకు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భరోసా
  • కష్టాలుంటయ్ కానీ, చరిత్రాత్మక ఫలితాలొస్తయ్ 

వాషింగ్టన్: ప్రపంచ దేశాలపై టారిఫ్​ల విషయంలో గట్టిగా నిలబడదామని అమెరికన్లకు ఆ దేశ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడం అంత ఈజీ కాదని, కానీ చివరలో ఫలితాలు మాత్రం చరిత్రాత్మకంగా ఉంటాయన్నారు. శనివారం ఆయన ఈమేరకు తన ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ పెట్టారు. ‘‘ప్రపంచ దేశాలపై టారిఫ్ లు విధించడం వల్ల అమెరికన్లకు మున్ముందు కష్టాలు తప్పవు. మనం కొంత నిరాశాజనకమైన పరిస్థితుల్లో ఉన్నాం. 

కానీ, దేశంలో పెట్టుబడులు పెరుగుతాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఉద్యోగాలు తిరిగి వస్తాయి. వ్యాపారాలు గణనీయంగా పెరుగుతాయి. అమెరికన్లంతా మరింత సంపన్నులు అవుతారు” అని ఆయన పేర్కొన్నారు. ‘‘ఇది ఒక ఆర్థిక విప్లవం. ఇందులో మనం తప్పకుండా గెలుస్తాం” అని భరోసా ఇచ్చారు. కాగా, ఏప్రిల్ 9 నుంచి 60 దేశాలపై పెద్ద ఎత్తున ప్రతీకార సుంకాలను అమలు చేస్తామని ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. 

ప్రధానంగా చైనా, జపాన్, ఈయూ దేశాలపై అత్యధికంగా సుంకాలు వసూలు చేస్తామన్నారు. అయితే, చైనీస్ వస్తువులపై ట్రంప్ 34 శాతం టారిఫ్ లు ప్రకటించగా.. చైనా కూడా అమెరికన్ వస్తువులపై 34% సుంకాలను ప్రకటించింది. భారత్ తమ దేశానికి చెందిన కొన్ని వస్తువులపై 100% వరకూ సుంకాలు వసూలు చేస్తోందన్న  ట్రంప్.. ఓవరాల్​గా ఇండియాపై 26% టారిఫ్ లు ప్రకటించారు. ఈ టారిఫ్​ల ప్రభావాన్ని పరిశీలిస్తున్నామన్న ఇండియా, ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.

హౌతీ రెబెల్స్ పై వైమానిక దాడి

యెమెన్ లో హౌతీ తిరుగుబాటుదారులపై తమ సైన్యం జరిపిన వైమానిక దాడులకు సంబంధించిన వీడియోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్  షేర్  చేశారు. తన ట్రూత్  సోషల్  నెట్ వర్క్ లో ఆ వీడియోను ఆయన పోస్టు చేశారు. ‘‘ఈ హౌతీ తిరుగుబాటుదారులు మళ్లీ ఏదో దాడికి సంబంధించి ప్లాన్ చేస్తున్నట్లున్నారు. అందరూ ఒక్కచోట సమావేశం కావడం గమనించి మా వైమానిక దళం వారిపై అటాక్  చేసింది. 

ఇక వారు మా ఓడలపై దాడి చేయలేరు’’ అని ట్రంప్  ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ దాడిలో పదుల సంఖ్యలో హౌతీ రెబెల్స్  చనిపోయినట్లు భావిస్తున్నారు. అమెరికానే ఈ అటాక్  జరిపిందని, పదుల సంఖ్యలో తిరుగుబాటుదారులు చనిపోయారని యెమెన్  అధికారులు, మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అంతకుముందు ఎర్ర సముద్రంలో అమెరికాకు చెందిన వాణిజ్య, మిలిటరీ నౌకలపై ఈ రెబెల్స్ దాడి చేశారు. 

దీంతో అమెరికా గత కొద్ది వారాలుగా వీరిపై ప్రతిదాడులు చేస్తున్నది. గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు స్పందనగా ఎర్ర సముద్రంలో అమెరికా ఓడలపై అటాక్  చేశామని హౌతీ రెబెల్స్  తెలిపారు.