ఆర్థిక వృద్ధి కోసం ప్రపంచం భారతదేశం వైపు చూస్తోంది : రాష్ట్రపతి

మువ్వన్నెల జెండా చూస్తే భారతీయుల హృదయం ఉప్పొంగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ప్రపంచంలోనే భారత్‌ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పారు. ప్రతి భారతీయుడికి కులం, మతం, భాష వంటి అనేక గుర్తింపులు ఉంటాయని, కానీ వాటన్నింటికంటే భారతీయుడు అనే గుర్తింపు చాలా గొప్పదని చెప్పారు. ప్రతి భారతీయుడు రాజ్యాంగం ముందు సమానమేనని, దేశంలోని ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు, హక్కులు, విధులు ఉన్నాయని రాష్ట్రపతి తెలిపారు. 

స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మతాంగిని హజ్రా, కనక్లట బారూహా, కస్తూర్బా గాంధీ, సరోజినీ నాయుడు, అమ్ము స్వామినాథన్‌, రమాదేవి, అరుణ అసఫ్‌ అలీ, సుచేతా కృపాళిని వంటి మహిళా స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు. 1947 ఆగస్టు 15న దేశ ప్రజలంతా పరాయి పాలన నుంచి విముక్తి పొందారని చెప్పారు. దేశ జీడీపీ ప్రతి ఏటా పెరుగుతోందన్నారు. గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు అనే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఆదివాసీల అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వాలని దేశ పౌరులందర్నీ కోరారు. 

పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం అన్నిరకాల చర్యలు చేపట్టిందన్నారు. ఈ ఏడాది చంద్రయాన్-3ని పంపించామని, అది జాబిల్లిపై అడుగుపెట్టే క్షణం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని రాష్ట్రపతి తెలిపారు. 2047లోగా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్‌ ఉండాలని ఆకాంక్షించారు. భారతదేశం ప్రపంచ వేదికపై తన సముచిత స్థానాన్ని తిరిగి పొందడమే కాకుండా, అంతర్జాతీయ క్రమంలో తన స్థానాన్ని కూడా పెంచుకుందన్నారు. G20 అధ్యక్ష పదవితో దేశ వాణిజ్యం, ఆర్థిక విషయాల్లో పురోగతి దిశగా నిర్ణయం తీసుకోగలదని చెప్పారు.

దేశ ఆర్థిక అభివృద్ధితోపాటు మానవ వనరుల అభివృద్ధి, వివాద రహిత సమాజానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ద్రౌపది ముర్ము చెప్పారు. భారతదేశ విద్యా వ్యవస్థలో మార్పు మొదలైందని అన్నారు. విద్యార్థులు, పలువురు విద్యావేత్తలతో చర్చించిన తర్వాత బోధించే ప్రక్రియ చాలా సులువుగా మారిందని గుర్తించినట్లు చెప్పారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ను ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.