హైదరాబాద్‎కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. స్వాగతం పలికిన గవర్నర్, CM రేవంత్

హైదరాబాద్: రెండు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణకు వస్తోన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‎కు చేరుకున్నారు. 2024, నవంబర్ 21న ఢిల్లీ నుండి హైదరాబాద్‎లోని బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రి సీతక్క, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ తదితరులు స్వాగతం పలికారు. బేగంపేట్ ఎయిర్ పోర్టు నుండి రాష్ట్రపతి ముర్ము నేరుగా రాజ్ భవన్‎కు వెళ్లారు. 

అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతోన్న కోటీ దీపోత్సవం కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. గురువారం (నవంబర్ 21) రాత్రి రాజ్ భవన్‎లో బస చేసి.. శుక్రవారం (నవంబర్ 22) శిల్పాకళా వేదికలో జరుగుతోన్న లోక్‌ మంథన్‌ 2024 కార్యక్రమంలో ఆమె పాల్గొనున్నారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాటు చేశారు. నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.