భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం (డిసెంబర్ 20న) భూదాన్ పోచంపల్లిలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మూడు ఆర్మీ హెలికాప్టర్లలో భూదాన్ పోచంపల్లికి చేరుకోనున్నారు. హెలిప్యాడ్ నుంచి 20 ప్రత్యేక కార్లలో టూరిజం సెంటర్ కు చేరుకోనున్నారు. అక్కడ టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీ కేంద్రాన్ని పరిశీలించనున్నారు.
భూదానోద్యమ కారులైన ఆచార్య వినోభాబావే, భూదాత వెదిరే రాంచంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి, నివాళులర్పించనున్నారు రాష్ట్రపతి. ఆ తర్వాత చేనేత కార్మికుల కుటుంబాలతో సమావేశం కానున్నారు. చేనేత మాస్టర్ వీవర్ శివకుమార్ తోనూ ప్రత్యేక సమావేశం కానున్నారు. బాలాజీ పంక్షన్ హాల్ లో మగ్గాలను పరిశీలించనున్నారు. 350 మంది ప్రత్యేక ఆహ్వానితులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు.
రాష్ట్రపతితో కలిసి కూర్చునేందుకు కేవలం ఆరుగురికి మాత్రమే వేదికపై ఆహ్వానం అందింది. గవర్నర్ తమిళి సై, రాష్ట్ర మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇద్దరు అధికారులకు అవకాశం దక్కింది. సుమారు 40 నిమిషాల పాటు భూదాన్ పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గడపనున్నారు.