జయధీర్ తిరుమలరావుకు రాష్ట్రపతి అభినందన

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రపతి మ్యూజియం డైరెక్టర్​గా ఉన్న తెలంగాణకు చెందిన జయధీర్ తిరుమలరావును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. ముర్ము రాష్ట్రపతిగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం రాష్ట్రపతి భవన్​లో ఏర్పాటు చేసిన ‘సూత్రకళా దర్పణ్’ ఆదివాసీ కళా ప్రదర్శనను ఆమె ప్రారంభించి తిలకించారు. వాయిద్య పరికరాలను, వాటి వివరాలను జయధీర్ తిరుమల రావును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల రావు గుంజాల గోండి లిపిని రాష్ట్రపతికి చూపిస్తూ వివరించారు. పురాతన ఆదివాసీ వస్తువులను ప్రదర్శనలో ఏర్పాటు చేయడంపై రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనను అభినందించారు. ప్రదర్శనలో సగానికిపైగా ఆద్య కళ మ్యూజియం హైదరాబాద్​కు చెందిన వస్తువులను ప్రదర్శించారు.

ALSO READ :ప్రజలకు పేలాలు పంచి కేసీఆర్​ బిర్యానీ తింటుండు: మధుయాష్కీ

హైదరాబాద్ ఫొటో గ్రాఫర్ సతీశ్​కు ప్రశంస

హైదరాబాద్ కు చెందిన ఫొటోగ్రాఫర్ అంధేకర్ సతీశ్ లాల్​ను రాష్ట్రపతి మెచ్చుకున్నారు. దేశంలోని ఆదివాసీలపై ఆయన రూపొందించిన ఫొటో డాక్యుమెంటరీని ఆమె అభినందించారు. మంగళవారం జన్ జాతీయ దర్పన్ ఆర్ట్ మ్యూజియంను రాష్ట్రపతి భవన్ లో ఆమె ప్రారంభించారు. ఇందులో దేశంలోని ఆదివాసీ తెగల పచ్చబొట్లు, సంస్కృతులు, జీవిన విధానాలపై 13 సంవత్సరాలుగా రూపొందించిన డాక్యుమెంటరీని సతీశ్ ప్రదర్శించారు. 60కి పైగా ఫొటోలను ఇందులో ఏర్పాటు చేశారు. సంతాల్ తెగ సంస్కృతులపై ఫొటోగ్రాఫ్‌‌‌‌లు, ప్రెసిడెంట్ ముర్ము జీవిత ప్రయాణంలో కొన్ని జ్ఞాపకాలను వర్ణించే ఫొటో ఆల్బమ్ ను ముర్ముకు బహూకరించారు. తర్వాత ఆమె మాట్లాడుతూ... సతీశ్​ను అభినందించారు.