హైదరాబాద్‎కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆ ఏరియాలో డ్రోన్లు ఎగరేయడంపై నిషేధం

హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. 2024, నవంబర్ 21, 22వ తేదీల్లో రెండు రోజుల పాటు ఆమె హైదరాబాద్‎లో పర్యటించనున్నారు. గురువారం (నవంబర్ 21) సాయంత్రం 6 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న రాష్ట్రపతి ముర్ము.. అక్కడి నుండి నేరుగా రాజ్ భవన్‎కు వెళ్లనున్నారు. సాయంత్రం 6.20 గంటల నుంచి 7.10 గంటల వరకు రాజ్‌భవన్‌లో ఉండి.. రాత్రి 7.20 గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతోన్న కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాత్రి రాజ్ భవన్‎లో ప్రెసిడెంట్ బస చేయనున్నారు. 

ALSO READ | నేను రాక్షసుణ్నే.. ప్రజల కోసం పని చేసే రాక్షసుడ్ని : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు

శుక్రవారం (నవంబర్ 22)  హైటెక్‌‌సిటీ శిల్పకళా వేదికలో లోక్ మంతన్ -2024 కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.05 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి తిరుగుపయనం అవ్వనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రపతి పర్యటనను దృష్టిలో పెట్టుకుని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్లు ఎగర వేయడంపై నిషేధం విధించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆదేశాలు నవంబర్ 22 వరకు అమల్లో ఉంటాయన్నారు. ఎవరైనా ఆదేశాలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి హెచ్చరించారు.