యాదాద్రి, వెలుగు : చేనేత రంగం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. తెలంగాణ చేనేత వస్త్రాల తయారీలో ఎంతో ముందున్నదన్నారు. పోచంపల్లి, వరంగల్, సిరిసిల్ల, గద్వాల, నారాయణపేట నుంచి అద్భుతమైన చేనేత వస్త్రాలను తయారు చేస్తున్నారని ప్రశంసించారు. బుధవారం యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో పర్యటించిన రాష్ట్రపతి ముర్ము ఇక్కడి చేనేత స్టాల్స్‌ను సందర్శించి వస్త్రాల తయారీని పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ అవార్డులు అందుకున్న కార్మికులతో మాట్లాడారు. ఆచార్య వినోబాభావే ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చేనేత కార్మికుల మీటింగ్ లో రాష్ట్రపతి మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఫ్యాషన్ డిజైన్ రంగంలో పోచంపల్లి చేనేత కార్మికులు విశేష కృషి చేస్తున్నారని మెచ్చుకున్నారు. చేనేత కార్మికులు తెలిపిన సమస్యలను, సూచనలను పరిగణనలోకి తీసుకుంటానని చెప్పారు. సోలార్ కరెంట్ వాడుతూ చేనేతలో జీరో కార్బన్ ఫుట్ ప్రింట్ దిశగా చేస్తున్న కృషిని అభినందించారు.
చేనేత రంగం సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మరింత కృషి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరావుకు రాష్ట్రపతి సూచించారు. చేనేత రంగంలో అవార్డు గ్రహీతలు బోగ సరస్వతి, లోక శ్యామ్ కుమార్, వెంకటేశంను వేదికపైకి ఆహ్వానించి వారి అనుభవాలను తెలుసుకున్నారు. ‘‘నేను కూడా గ్రామీణ ప్రాంతం నుంచే వచ్చాను. మా ప్రాంతం నుంచి కొందరిని ఇక్కడి పంపించి, చేనేత రంగం పని తీరును తెలుసుకునేలా కృషిచేస్తా”అని ముర్ము చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు తుమ్మల, సీతక్క, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, కేంద్ర జౌళి శాఖ కార్యదర్శి రచన సాహు, రాష్ట్ర చేనేత శాఖ కార్యదర్శి అలుగు వర్షిణి, కలెక్టర్ హనుమంతు జెండగే తదితరులు పాల్గొన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి 2 గంటల పాటు ఇక్కడ గడిపిన రాష్ట్రపతి 12.30కు తిరిగి హైదరాబాద్బయలుదేరారు.
రాష్ట్రపతి పర్యటనలో అపశ్రుతి
రాష్ట్రపతి ముర్ము పర్యటన సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకుంది. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే టైంలో వచ్చిన గాలి వేగానికి కొందరు పోలీసులు ఎగిరిపడ్డారు. రాష్ట్రపతి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సహా మూడు ఆర్మీ హెలికాప్టర్లు పోచంపల్లికి వచ్చాయి. ల్యాండ్ అయ్యే సమయంలో హెలికాప్టర్ల గాలికి కార్పెట్లు పైకి లేచాయి. కార్పెట్లపై నిలబడి ఉన్న పోలీసులు దాదాపు ఏడెమినిది ఫీట్లు పైకి లేచి కింద పడ్డారు. దీంతో ఉప్పల్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ కు చేయి ఫ్రాక్చర్ అయింది. మిగిలిన వారికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, ఏసీపీ శ్రీనివాస్ కండ్లు తిరిగి పక్కనే ఉన్న ఆఫీసర్ పై పడిపోయారని, అంతేతప్ప హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో గాయపడలేదని డీసీపీ రాజేశ్ చంద్ర తెలిపారు.