నేడు యాదగిరిగుట్టకు రానున్న ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ ద్రౌపది ముర్ము

  • మూడు హెలిప్యాడ్లను సిద్ధం చేసిన ఆఫీసర్లు
  • 31 వెహికల్స్‌‌‌‌‌‌‌‌తో ట్రయల్స్‌‌‌‌‌‌‌‌
  • ఆఫీసర్లకు ఆర్టీపీసీఆర్‌‌‌‌‌‌‌‌ టెస్టులు
  • గంటన్నరపాటు యాదాద్రిలో రాష్ట్రపతి పర్యటన

యాదాద్రి/యాదగిరిగుట్ట, వెలుగు : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదగిరిగుట్ట పర్యటనకు అంతా సిద్ధమైంది. ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నుంచి యాదగిరిగుట్టకు రానున్న రాష్ట్రపతి 10 నుంచి 10.30 గంటల వరకు గర్భగుడిలో స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం 10.40 గంటలకు తిరిగి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు బయలుదేరనున్నారు. ఇందుకోసం ఆఫీసర్లు ఏర్పాట్లు చేశారు. గుట్టలోని యాగశాల ప్లేస్‌‌‌‌‌‌‌‌లో మూడు హెలీప్యాడ్‌‌‌‌‌‌‌‌లను రెడీ చేశారు. వీటిని ఏవియేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు, బాంబ్‌‌‌‌‌‌‌‌, డాగ్‌‌‌‌‌‌‌‌ స్క్వాడ్స్‌‌‌‌‌‌‌‌తో తనిఖీ చేసి, ఎవరూ ప్రవేశించకుండా ఫెన్సింగ్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి వెంట గవర్నర్‌‌‌‌‌‌‌‌ తమిళిసై సౌందరరాజన్‌‌‌‌‌‌‌‌, కేంద్రమంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి కూడా రానున్నారు. రాష్ట్రపతి గుట్టకు చేరుకోగానే మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఇంద్రకరణ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌‌‌‌‌‌‌‌, రాచకొండ సీపీ మహేశ్‌‌‌‌‌‌‌‌ భగవత్‌‌‌‌‌‌‌‌, కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి, టెంపుల్‌‌‌‌‌‌‌‌ ఈవో గీతారెడ్డి స్వాగతం పలకనున్నారు. కొందరు మహిళా ఆఫీసర్లు రాష్ట్రపతిని కలిసే చాన్స్‌ ఉండడంతో కలెక్టర్‌‌‌‌‌‌‌‌తో పాటు, మహిళా ఆఫీసర్లకు ఆర్టీపీసీఆర్‌‌‌‌‌‌‌‌ టెస్టులు చేశారు. పోలీస్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ నుంచి పాస్‌‌‌‌‌‌‌‌లు పొందిన వారినే అనుమతించనున్నారు. 

నేరుగా ప్రధానాలయం వద్దకు చేరుకునేలా...

రాష్ట్రపతి కాన్వాయ్‌‌‌‌‌‌‌‌ హెలీప్యాడ్‌‌‌‌‌‌‌‌ నుంచి నేరుగా ప్రధానాలయం వద్దకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం కొండపై ప్రొటోకాల్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ పక్క నుంచి క్యూకాంప్లెక్స్ పైవరకు ప్రత్యేక ర్యాంప్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఉత్తర, త్రితల రాజగోపురం నుంచి ప్రధానాలయం వరకు రెడ్‌‌‌‌‌‌‌‌ కార్పెట్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రపతి త్రితల రాజగోపురం వద్దకు చేరుకోగానే ఆలయ ప్రధానార్చకుడు నల్లంతీగళ్‌‌‌‌‌‌‌‌ లక్ష్మీనర్సింహాచార్యుల ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలకనున్నారు. స్వయంభుమూర్తుల దర్శనం అనంతరం ప్రధానాలయ ముఖ మండపంలో అర్చకులు చతుర్వేద ఆశీర్వచనం చేయనున్నారు. కొండపైన వీవీఐపీ గెస్ట్‌‌‌‌‌‌‌‌ హౌజ్‌‌‌‌‌‌‌‌ నుంచి లిఫ్ట్ ద్వారా ప్రధానాలయానికి చేరుకునేలా మరో రూట్‌‌‌‌‌‌‌‌ను కూడా ఆఫీసర్లు రెడీ చేశారు. 

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌‌‌‌‌‌‌‌, సీపీ

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.  బందోబస్తు ఏర్పాట్లను గురువారం సీపీ మహేశ్‌‌‌‌‌‌‌‌భగవత్‌‌‌‌‌‌‌‌, కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి పరిశీలించారు. హెలీప్యాడ్‌‌‌‌‌‌‌‌ నుంచి రాష్ట్రపతి కాన్వాయ్‌‌‌‌‌‌‌‌ వెళ్లే ప్రెసిడెన్షియల్‌‌‌‌‌‌‌‌ రోడ్డు, రింగ్‌‌‌‌‌‌‌‌ రోడ్డు, టెంపుల్‌‌‌‌‌‌‌‌ ఘాట్‌‌‌‌‌‌‌‌ రోడ్డును తనిఖీ చేశారు. అనంతరం 31 వెహికల్స్‌‌‌‌‌‌‌‌తో హెలీప్యాడ్‌‌‌‌‌‌‌‌ నుంచి కొండపై వరకు కాన్వాయ్‌‌‌‌‌‌‌‌ ట్రయల్స్‌‌‌‌‌‌‌‌ చేశారు. అక్కడి నుంచి ఉత్తర రాజగోపురం నుంచి ఆలయంలోకి ప్రవేశించే రూట్‌‌‌‌‌‌‌‌ను పరిశీలించారు. ఆరుగురు డీసీపీలు, 15 మంది ఏసీపీలు, 40 మంది సీఐలు, 100 మంది ఎస్సైలు, 200 మంది ఉమెన్‌‌‌‌‌‌‌‌ సిబ్బందితో సహా 1200 మంది పోలీసులతో సెక్యూరిటీ కల్పించనున్నారు. సెక్యూరిటీ సిబ్బంది ఇప్పటికే ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 

గుట్టకు రానున్న తొలి మహిళా రాష్ట్రపతి

లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న వారిలో ద్రౌపది ముర్ము ఐదో రాష్ట్రపతి కాగా మహిళల్లో ఫస్ట్‌‌‌‌‌‌‌‌. ఇప్పటివరకు స్వామివారిని 1959లో బాబూ రాజేంద్రప్రసాద్‌‌‌‌‌‌‌‌, 1963లో సర్వేపల్లి రాధాకృష్ణన్, 1995లో శంకర్‌‌‌‌‌‌‌‌ దయాల్‌‌‌‌‌‌‌‌ శర్మ, 2015లో ప్రణబ్‌‌‌‌‌‌‌‌ ముఖర్జీ దర్శించుకున్నారు. 

మధ్యాహ్నం వరకు దర్శనాలు బంద్ 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం యాదగిరిగుట్టకు వస్తుండడంతో మధ్యాహ్నం వరకు సాధారణ భక్తుల దర్శనాలను బంద్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఉదయం సుప్రభాత సేవ నుంచి మధ్యాహ్నం నివేదన వరకు భక్తులను దర్శనాలకు అనుమతించబోమని ఆఫీసర్లు ప్రకటించారు. ధర్మ దర్శనాలు, వీఐపీ, బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. స్వామివారికి నిత్య పూజలు, కైంకర్యాలు అంతర్గతంగా యథాతథంగా కొనసాగుతాయని చెప్పారు. రాష్ట్రపతి పర్యటన ముగిసిన తర్వాత కొండపైకి భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు.