భరతమాత ముద్దుబిడ్డల్లో మన్మోహన్ సింగ్ ఒకరు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భరతమాత ముద్దుబిడ్డల్లో మన్మోహన్ సింగ్ ఒకరు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి దౌపది ముర్మూ స్పందిస్తూ.." విద్యను, పరిపాలనను సమానంగా విస్తరింపజేసిన అరుదైన రాజకీయ నాయకుల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒకరు. దేశ ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో కీలకపాత్ర పోషించారు. దేశానికి ఆయన చేసిన సేవ, ఆయన రాజకీయం జీవితం, వినయంతో కూడిన నడవడిక ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన మృతి దేశానికి తీరనిలోటు. భరతమాత ముద్దుబిడ్డల్లో ఒకరైన మన్మోహన్ కు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నా" అని ట్వీట్ చేశారు.

ప్రధాని మోదీ స్పందిస్తూ.." దేశం విశిష్టమైన వ్యక్తుల్లో ఒకరైన మన్మోహన్ సింగ్‎ను కోల్పోయింది. ప్రధానిగానే కాకుండా ఆర్థిక మంత్రిగా, ఎన్నో ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగిగా పనిచేశారు. దేశ ఆర్థిక విధానంపై ఎన్నో ఏండ్లుగా బలమైన ముద్రవేశారు. పార్లమెంట్‎లో ఆయన ప్రసంగాలు గొప్పగా ఉండేవి. ప్రధానిగా దేశ ప్రజల జీవితాలు మెరుగుపరిచేందుకు ఎంతో కృషి చేశారు. ఈ సమయంలో నా ఆలోచనలన్నీ ఆయన కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయి” అని పేర్కొన్నారు. లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.."గురువు, మార్గదర్శిని కోల్పోయాను. జ్ఞానం, సమగ్రతతో మన్మోహన్ సింగ్ దేశాన్ని నడిపించారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి" అని పేర్కొన్నారు.

 కాంగ్రెస్ చీఫ్ ఖర్గే స్పందిస్తూ..“దేశం దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది. మన్మోహన్ ఆర్థిక విధానాలు దేశంలో పేదరికాన్ని తగ్గించాయి. మన్మోహన్ ను దేశం కృతజ్ఞతతో ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది" అని వెల్లడించారు. ప్రియాంక గాంధీ స్పందిస్తూ.." రాజకీయాల్లో కొద్ది మంది మాత్రమే ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారు. ఆ కొద్ది మందిలో  ఒకరే మన్మోహన్‌‌ సింగ్. ఆయన నిజాయితీ మాకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ ఉంటుంది. దేశాన్ని ఆయన నిజంగా ప్రేమించేవారు. ప్రజలకు సేవ చేయాలనే నిబద్ధతతోనే బతికారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా" అని ట్వీట్ చేశారు.