శీతాకాల విడిదికి రాష్ట్రపతి.. డిసెంబర్ 17 నుంచి 21 వరకు హైదరాబాద్ లో బస

  • ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ రివ్యూ

హైదరాబాద్, వెలుగు: శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌‌‌‌ రానున్నారు. ఈ నెల 17 నుంచి 21 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేస్తారు. ఈ మేరకు ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సీఎస్ శాంతికుమారి సెక్రటేరియెట్​లో మంగళవారం రివ్యూ చేశారు. ‘‘అధికారులు సమన్వయంతో పని చేయాలి. 24 గంటల పాటు స్నేక్ క్యాచర్ బృందాన్ని అందుబాటులో ఉంచాలి.

రాష్ట్రపతి నిలయం పరిసరాల్లో కోతుల బెడద లేకుండా జీహెచ్​ఎంసీ అధికారులతో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, రాష్ట్రపతి నిలయం అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలి. భద్రత విషయంలో పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండాలి. ట్రాఫిక్, బందోబస్తుపై ప్రణాళికలు రూపొందించాలి.

రాష్ట్రపతి నిలయం వద్ద ఫైరింజన్లు, ఫైర్ టెండర్లను ఏర్పాటు చేయాలి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. తమ సహాయక సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలి. అవసరమైన బారికేడ్లు, ఇతర ఏర్పాట్లను రోడ్డు భవనాల శాఖ అధికారులు చూసుకోవాలి. జీహెచ్​ఎంసీ, పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలి’’అని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.