
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగుతోంది. రామప్ప దేవాలయానికి చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం పలికారు. రుద్రేశ్వరుడిని దర్శించుకుని రాష్ట్రపతి పూజలు చేశారు. రాష్ట్రపతికి ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను వేద పండితులు అందించారు. మేడారం సమ్మక్క సారలమ్మ సారే ( చీర ను మేడారం ఆదివాసీ పూజారులు రాష్ట్రపతి, గవర్నర్ లకు ఇచ్చారు. ఆలయ విశిష్టత, నిర్మాణం, యునెస్కో గుర్తింపుకు కోసం తయారు చేసిన డోసియర్ వివరాలు, వరల్డ్ హెరిటేజ్ బాడి విధించిన నిబంధనలు, తదితర అంశాలను రాష్ట్రపతికి కాకతీయ హెరిటేజ్ ట్రస్టు కన్వీనర్ పాండురంగారావు వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించారు. రాష్ట్రపతితో పాటు పూజల్లో పాల్గొన్న వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్, రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. భద్రాచలం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో రామప్ప ఆలయానికి రాష్ట్రపతి ముర్ము వచ్చారు. హెలిప్యాడ్ నుంచి బ్యాటరీ కారులో యునెస్కో గుర్తింపు పొందిన రామప్పకు ఆమె చేరుకున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా రామప్ప ఆలయాన్ని NSG అధికారులు పూర్తిగా వారి ఆధీనంలోకి తీసుకున్నారు.
ప్రసాద్ పథకం...
ప్రసాద్ పథకంలో భాగంగా కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రామప్ప చుట్టుపక్కల కల్పించునున్న మౌలిక సదుపాయాల శిలాఫలకం, కామేశ్వరాలయ పునర్ నిర్మాణ శిలాఫలకాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. రామప్ప ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం ‘ప్రసాద్’ పథకంలో భాగం గా రూ.61.99 కోట్లను మంజూరు చేసింది. ఈ పథకంలో 4 డి మూవీ హాల్, కాకతీయ తోరణం ఆర్చీ, గార్డెన్, ప్లేగ్రౌండ్, వాహనాల పార్కింగ్, హోటళ్లు, షాపింగ్ మాల్స్, రహదారుల విస్తరణ, లైటింగ్, సిట్టింగ్ బెంచీలు, సీసీ కెమెరాలు, సర్వేలైన్స్ సిస్టంలు ఏర్పాటు, మాలిక సదుపాయాల కల్పనతో పాటు సోలార్ విద్యుత్ పవర్‌ప్లాంట్, చెరువులో జెట్టి బోట్స్ తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
భద్రాద్రిలో...
అంతకుముందు... భద్రాద్రి రామయ్యను రాష్ట్రపతి ముర్ము దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలో శ్రీసీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద రాష్ట్రపతికి అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘ప్రసాద్ ’ పథకం శిలాఫకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రపతి వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై, మంత్రులు పువ్వాడ అజయ్ , సత్యవతి రాథోడ్ ఉన్నారు. సమ్మక్క సారలమ్మ పూజారి సమ్మేళనంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. తర్వాత వర్చువల్ విధానంలో కొమరంభీం ఆసిఫాబాద్ , మహబూబాబాద్ జిల్లాల్లోని ఏకలవ్య పాఠశాలలను ప్రారంభించారు.మరోవైపు ఈ నెల 30న యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహాస్వామిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకోనున్నారు . ఇందులో భాగంగా యాదాద్రిలో అధికారులు హెలికాప్టర్ తో మాక్ డ్రిల్ చేశారు. రాష్ట్రపతి స్పెషల్ టీం అధికారులు.. స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు.