కర్నూలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం పర్యటన ముగిసింది. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొన్నారు.శ్రీ భ్రమరాంబ అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమంలో అలాగే స్వామి వారి అభిషేకంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాదం స్కీంలో భాగంగా పలు అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు.
రాష్ట్రపతికి స్వాగతం పలికిన తెలంగాణ గవర్నర్ తమిళిసై, మంత్రి కొట్టు సత్యనారాయణ
శ్రీశైలం వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టుసత్యనారాయణ, మంత్రి రోజా తదితరులు స్వాగతం పలికారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం ఆలయం వద్దకు మధ్యాహ్నం 12-45 గంటలకు చేరుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు దేవదాయశాఖ కమిషనర్ డాక్టర్ హరి జవహర్ లాల్, ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, దేవస్థానం ఈఓ లవన్న, అర్చకస్వాములు, వేద పండితులు ఆలయ మర్యాదలతో రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
శ్రీశైలం ప్రధాన ఆలయంలోకి ప్రవేశించిన అనంతరం ముందుగా రత్న గర్భ గణపతి స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత మల్లికా గుండంలో ప్రతిబింబించే ఆలయ విమాన గోపురాన్ని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ భ్రమరాంబ దేవి అమ్మవార్లకు కుమార్చన జరిపించుకున్నారు. పూజల అనంతరం రాష్ట్రపతి, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ లకు అర్చక స్వాములు, వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను, శేష వస్త్రాలను, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి చిత్రపటాల జ్ఞాపికను అందజేశారు.
నంది సర్కిల్ వద్ద యాత్రికుల సదుపాయ కేంద్రం శిలా ఫలకం ఆవిష్కరణ
నంది సర్కిల్ సమీపంలో రూ. 43.08 కోట్లతో చేపట్టిన టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్ (యాత్రికుల సదుపాయ కేంద్రం) ప్రసాద్ ప్రాజెక్ట్‌ను రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిలై సాయి సౌందరాజన్ రిబ్బన్ కట్ చేసి శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. హటకేశ్వరం, శిఖరేశ్వరంలలో ఎమినీటిస్ సెంటర్, శిఖరేశ్వరంలో పుష్కరిణి పునరుద్ధరణ, ఆలయంలో కళాత్మక విద్యుద్దీకరణ, బస్టాండ్ నుంచి పాతాళ గంగ వరకు కృష్ణవేణి రోడ్డు నిర్మాణం, యాంఫీ థియేటర్, ఇల్యూమినేషన్స్ మరియు సౌండ్ అండ్ లైట్ షో, డిజిటల్ ఇంటర్‌వెన్షన్, పార్కింగ్ ఏరియా, టాయిలెట్ కాంప్లెక్స్‌లు, సావనీర్ షాపులు, ఫుడ్ కోర్ట్, ఏటీఎం, బ్యాంకింగ్ సేవలు తదితర అత్యాధునిక సౌకర్యాలను భక్తులకు,యాత్రికులకు ప్రసాద్ స్కీం ద్వారా అందించనున్నారు.
శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శన
శ్రీశైల మహా క్షేత్రంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. స్ఫూర్తి కేంద్రానికి వచ్చిన రాష్ట్రపతి, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరాజన్ లకు శివాజీ స్ఫూర్తి కేంద్ర ప్రెసిడెంట్ టి.జి.వెంకటేష్ ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థులు చెంచు నృత్యంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి చెంచు మహిళతో మహిళలతో ముఖాముఖి మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీజీ వెంకటేష్ తదితరులు రాష్ట్రపతి ముఖాముఖిలో స్థానికులకు సహకరించారు.
కార్యక్రమంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పర్యాటక శాఖ మంత్రివర్యులు రోజా, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్, జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న, ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ మేద జోష్ణవి, ఐటిడిఏ పిఓ రవీంద్రారెడ్డి, శివాజీ స్ఫూర్తి కేంద్ర వైస్ ప్రెసిడెంట్ ఉద్యాజి, కేంద్ర ఇంచార్జి నాగేశ్వరరావు,సెక్రెటరీ జి.రఘురామయ్య తదితరులు పాల్గొన్నారు.