నేతన్నలతో ..రాష్ట్రపతి మాటా ముచ్చట

  •     చీరల తయారీ పరిశీలన
  •     నూలు వడుకుతున్న మహిళలను కలిసిన ముర్ము

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో  భూదాన్​ పోచంపల్లిలో  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం పర్యాటించారు. పర్యటనలో భాగంగా పోచంపల్లి నేతన్నలతో రాష్ట్రపతి మమేకమయ్యారు. నూలు వడకడం, మగ్గంనేయడాన్ని పరిశీలించారు. తెలంగాణ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన పేవిలియన్ థీమ్ సందర్శించి నూలు నుంచి వస్త్ర ఉత్పత్తి పరిణామక్రమాన్ని తెలియజేసే చేనేత స్టాళ్లను, అసు యంత్రాన్ని పరిశీలించారు. మగ్గంపై చీరను నసే పద్ధతిని చూశారు. పోచంపల్లి ఇక్కత్​ వస్త్రాల ప్రత్యేకతను అడిగి తెలుసుకున్నారు. 30 మందికి పైగా మహిళలు చరాఖాలతో నూలు వడుకుతుండగా ఆసక్తిగా గమనించారు.

భూదానోద్యమకారుడు ఆచార్య వినోబాభావే ఫొటోకు రాష్ట్రపతి పూలమాల వేసి అక్కడ ఏర్పాటు చేసిన వినోబా భావే ఫొటో ఎగ్జిబిషన్​ తిలకించారు. సిల్క్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ కంట్రోల్ యూనిట్స్ సందర్శించి పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం అవార్డులు పొందిన వారితో ఏర్పాటు చేసిన మీటింగ్​లో పాల్గొన్నారు.  ఈ మీటింగ్​లో   సెంట్రల్​ టెక్స్​టైల్స్​ సెక్రటరీ రచనా సాహు స్వాగతం పలికారు. అనంతరంసభికులతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ గీతం ఆలపించారు. రాష్ట్రపతి ముర్ముకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క నేత వస్త్రాలు అందించారు.

దశాబ్దాల తరబడి చేనేత రంగంలో కొనసాగుతున్న కార్మికురాలు పొట్టబత్తిని సుగుణ తొలుత నేత వస్త్రాన్ని అందించి స్వాగతం పలికారు. భారత దేశం, మధ్యలో చరాఖాను చేర్చి రూపొందించిన డబుల్​ ఇక్కత్​ వస్త్రాన్ని కొండా లక్ష్మణ్​ బాపూజీ పురస్కార గ్రహీత బోగ సరస్వతి అందించారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు సభికుల మధ్య నుంచి మాట్లాడుతుండగా వారిని వేదికపైకి రమ్మని రాష్ట్రపతి ముర్ము ఆహ్వానించి, చేనేత రంగంలో వారి అనుభవాలను విన్నారు. మీ నుంచి తెలుసుకున్నానని, కొంత జ్ఞానాన్ని కూడా పొందానని ముర్ము తెలిపారు. 

యారన్​ డిపోను ఏర్పాటు చేయాలి

ఆజాద్​ కా అమృత్​ మహోత్సవ్​ లో నా భర్త బోగ బాలయ్య చేనేత కళానైపుణ్యాన్ని ప్రదర్శించారు. పదివేల రంగులతో దేశ చిత్రాన్ని రూపొందించి.. మధ్యలో చరకా వచ్చే విధంగా డబుల్​ ఇక్కత్​ వస్త్రంతో రూపొందించి అందించాం. ఇండియా డబుల్​ ఇక్కత్​లో జాతీయ జెండా మధ్యలో చక్రం వచ్చే విధంగా రూపొందించాం. నేత వస్త్రాల కోసం అవసరమైన ముడిసరుకు సరైన టైంలో లభ్యం కావడం లేదు. సబ్సిడీ ఇస్తున్నా నూలు దారం కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ముడిసరుకు కోసం యారన్​ డిపోను ఏర్పాటు చేయాలి.

– బోగ సరస్వతి, కొండా లక్ష్మణ్​ బాపూజీ అవార్డ్​ గ్రహీత