హైదరాబాద్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేషనల్ పోలీస్ అకాడమీని సందర్శించారు. 74వ బ్యాచ్ ట్రైనీ ఐపీఎస్ ల నుంచి ఈసందర్భంగా రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం నేషనల్ పోలీస్ అకాడమీ అధికారులతో రాష్ట్రపతి సమావేశమయ్యారు. అకాడమీలోనే దాదాపు 1 గంట 25 నిమిషాల పాటు రాష్ట్రపతి గడిపారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం రాష్ట్రపతి మిథానికి బయలుదేరి వెళ్లారు. మిథానిలో ఏర్పాటుచేసిన వైడ్ ప్లేట్ మిల్ ప్లాంట్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారు.
అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాలను సందర్శించారు. అక్కడి విద్యార్థులు, బోధనా సిబ్బందితో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో దాదాపు రెండు గంటలపాటు సమావేశమైన రాష్ట్రపతి విద్యార్థులతో స్నేహపూర్వకంగా సంభాషించారు. ఈక్రమంలో ‘‘నువ్వు ప్రధానమంత్రి అయితే ఏం చేస్తావు?’’ అని వరుణ్ గణేశ్ కుల్ కర్ణి అనే ఒక విద్యార్థిని రాష్ట్రపతి అడిగారు. దీనికి ఆ విద్యార్థి బదులిస్తూ.. ‘‘సారే జహాసె అచ్ఛా.. హిందూ సితా హమారా’’ అంటూ మాట్లాడటం మొదలుపెట్టాడు.
‘‘నేను ఒకవేళ ప్రధానమంత్రిని అయితే.. ఈ దేశాన్ని సంస్కారంతో నింపే ప్రయత్నం చేస్తాను. దేశం పేరును మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు నావంతుగా ప్రయత్నిస్తాను. మన కళలు, సంస్కృతి, సంగీతం వంటివి పునరుజ్జీవింప చేసే ప్రయత్నం చేస్తాను. పండిట్ భీమాసేన్ వంటి కళాకారులు భారత గడ్డపై మళ్లీ జన్మించి.. భారత సంస్కారం విలువను ప్రపంచానికి చాటిచెప్పాలనేది నా ఆశయం, ఆకాంక్ష’’ అని ఆ విద్యార్థి చెప్పాడు. అనంతరం రాష్ట్రపతి ముర్ము ఆ విద్యార్థిని మెచ్చుకున్నారు. ‘‘ఎంతోమంది భరత నాట్యం, కథాకళి, ఒడిస్సీ వంటి నృత్య రీతులను నేర్చుకుంటూ ఉంటారు. వాటిలో ఇక్కడి జీవితం, పురాణాలు, సంస్కృతి, అద్భుతమైన గాధలు దాగి ఉన్నాయి. కాకపోతే వాటి కళాత్మకత దాగి ఉంటుంది.’’ అని రాష్ట్రపతి వివరించారు.