వక్ఫ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

వక్ఫ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

న్యూఢిల్లీ:  పార్లమెంట్ ఉభయ సభలు పాస్ చేసిన వక్ఫ్​(సవరణ) బిల్లు, 2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదించిన వెంటనే ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. వక్ఫ్​బోర్డుల అధీనంలోని ఆస్తుల నిర్వహణలో పారదర్శకత కోసమని కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తెచ్చిన ఈ బిల్లుపై పార్లమెంట్ ఉభయసభల్లో వాడివేడిగా సుదీర్ఘ చర్చలు జరిగాయి. లోక్ సభ బుధవారం రాత్రి, రాజ్యసభ గురువారం రాత్రి ఈ బిల్లును ఆమోదించాయి. లోక్​సభ లో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగి న ఓటింగ్​లో బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది ఎంపీలు ఓటేశారు. 

రాజ్యసభలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఓటింగ్​లో బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. ఉభయసభల్లో పాస్ అయిన తర్వాత బిల్లును కేంద్రం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా, తాజాగా ఆ ప్రక్రియ కూడా పూర్తయి చట్టంగా మారింది. అయితే, వక్ఫ్ బిల్లుపై దేశవ్యాప్తంగా మైనార్టీ వర్గాలు, కాంగ్రెస్, లెఫ్ట్, ఇతర పార్టీలు నిరసనలు తెలిపాయి. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, దీనిని కొట్టివేయాలంటూ కాంగ్రెస్, ఎంఐఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు.