కొత్త చట్టంలో ఎఫ్ఐఆర్

కొత్త చట్టంలో ఎఫ్ఐఆర్

పార్లమెంటు ఇటీవల ఆమోదించిన మూడు కొత్త క్రిమినల్ కోడ్ బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 25న ఆమోదం తెలిపారు. ఈ కొత్త చట్టాలు, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా సంహిత. ఈ చట్టాల అమలు తేదీని కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. ఆ తేదీని ప్రకటించగానే భారతీయ శిక్షాస్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, భారతీయ సాక్ష్యాధారాల చట్టాలు తొలిగిపోతాయి. వీటి స్థానంలో కొత్త చట్టాలు వస్తాయి. ఈ కొత్త చట్టాల అమలుకు మార్గాన్ని సుగమం చేసే విధంగా చర్యలు చేపట్టాలని హోం మినిస్టర్ అమిత్ షా అన్ని వ్యవస్థలకి లేఖ రాశారు.

భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్​ఎస్​ఎస్​) 2023, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973ని భర్తీ చేస్తుంది. ఈ కొత్త చట్టంలో ఇతర మార్పులతో పాటు, ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్ నమోదుకు ముందు తీసుకోవాల్సిన చర్యల గురించి, జీరో- ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్, ఈ–ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్​ల గురించి అదేవిధంగా ప్రాథమిక విచారణ నిబంధనలను ప్రవేశపెట్టడమైంది. ఈ మూడు భావనల గురించి, నిబంధనల గురించి వివరంగా అర్థం చేసుకుందాం.

జీరో ఎఫ్ఐఆర్

జీరో -ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ అంటే నేరం జరిగిన ప్రాంతంతో (అధికార పరిధితో) సంబంధం లేకుండా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవచ్చు. వీటిని జీరో ఎఫ్ఐఆర్ అని అంటారు. కాగ్నిజబుల్ నేర సమాచారం అందుకున్న పోలీస్ స్టేషన్ ఇంచార్జి అధికారి, తన అధికార పరిధితో నిమిత్తం లేకుండా తన పోలీసు స్టేషన్‌‌‌‌‌‌‌‌లో జీరో ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్ నమోదు చేయవచ్చు. మరోవిధంగా చెప్పాలంటే, సంఘటన ఎక్కడ జరిగినా, ఏ పోలీసు స్టేషన్‌‌‌‌‌‌‌‌లో అయినా జీరో ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్ నమోదు చేయవచ్చు.  ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత, పోలీసు స్టేషన్ సంబంధిత పత్రాలను ఈ విషయంపై అధికార పరిధిని కలిగి ఉన్న పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు బదిలీ చేయాల్సి ఉంటుంది. సంబంధిత పోలీస్ స్టేషన్​కు చెందిన పోలీస్ అధికారి తిరిగి తన పోలీస్ స్టేషన్ లో ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ను నమోదు చేసి, కేసును దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. తన ప్రాంత అధికార పరిధితో సంబంధం లేకుండా మొదటి సమాచారాన్ని నమోదు చేయడమనేది  పోలీసు అధికారి విధి.  ఈ  జీరో- ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్ నిబంధన బాధితులకు సహాయపడుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్​లో ఎఫ్ఐఆర్ గురించి సెక్షన్ 154లో చెప్పారు. BNSSలో దానికి సంబంధించిన  సెక్షన్ 173.

సెక్షన్ 173లోని  సంబంధించిన భాగం ఇలా.. 

నేరం జరిగిన ప్రాంతంతో సంబంధం లేకుండా, కాగ్నిజబుల్ నేరానికి (గుర్తించదగిన నేరానికి) సంబంధించిన సమాచారాన్ని మౌఖికంగా లేదా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఇవ్వవచ్చు. ఈ సమాచారం పోలీసు స్టేషన్‌‌‌‌‌‌‌‌లోని ఆఫీసర్ ఇన్చార్జ్ అధికారికి ఇచ్చినట్లయితే.. అది మౌఖికంగా ఉన్నప్పుడు అది అతను చెప్పినవిధంగా రాయాలి లేదా అతనే రాయాలి.  సమాచారం అతను చెప్పినవిధంగా రాసినప్పుడు వారికి చదివి వినిపించాల్సి ఉంటుంది. అటువంటి సమాచారం, రాతపూర్వకంగా ఇచ్చినా, లేదా పైన పేర్కొన్న విధంగా రాసినా వారి సంతకం తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఎవరైనా సమాచారం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి మూడు రోజులలోపు సంతకం చేయాల్సి ఉంటుంది. ఆ  తర్వాత అది నమోదు చేయబడుతుంది. 

మహిళలపై  నేరాలకు సంబంధించి..

జీరో- ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్ అనేది భారతీయ క్రిమినల్ లా సిస్టమ్‌‌‌‌‌‌‌‌లో కొత్తగా కనుగొన్న భావన కాదు. హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ (2015) జారీ చేసిన ఒక సలహాలో,  మహిళలపై నేరాలకు సంబంధించి జీరో -ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌లను నమోదు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇది మాత్రమే కాదు.  కోర్టులు కూడా అనేక కేసులలో జీరో- ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్ నమోదు ఆవశ్యకత గురించి నొక్కి చెప్పింది. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ పునతి రాములు, ఇతరుల కేసులో సుప్రీంకోర్టు ఇలా పేర్కొంది, “ఏదైనా కాగ్నిజబుల్ నేరం తన ప్రాదేశిక అధికార పరిధిలో జరగలేదన్న కారణంగా ఆ సమాచారాన్ని నమోదు చేయకుండా నిరాకరించడానికి వీల్లేదు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దాని అధికార పరిధి ఉన్న పోలీసు స్టేషన్‌‌‌‌‌‌‌‌కు ఫార్వార్డ్  చేయాల్సి ఉంటుంది. సత్వీందర్ కౌర్ వర్సెస్ గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ఎన్.సి.టి. కేసులో సుప్రీంకోర్టు ఇలా పేర్కొంది. దర్యాప్తు ముగిసిన తర్వాత నేరం తన ప్రాదేశిక అధికార పరిధిలో జరగలేదని, ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్ నమోదు చేయడం సరైంది కాదని, దర్యాప్తు చేసిన అధికారి నిర్ణయానికి వస్తే అప్పుడు అతను క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 170 ప్రకారం తదనుగుణంగా ఒక నివేదికను సమర్పించవలసి ఉంటుంది. కేసును కాగ్నిజన్స్ తీసుకునే అధికారంవున్న మేజిస్ట్రేట్‌‌‌‌‌‌‌‌కు ఫార్వార్డ్ చేయాలి.  బీఎన్​ఎస్​ఎస్​ ఇప్పుడు జీరో ఎఫ్​ఐఆర్​ కోసం చట్టబద్ధమైన ఆదేశాన్ని ఈ నిబంధనలో స్పష్టం చేసింది. 

ఈ-ఎఫ్ఐఆర్ 

సెక్షన్ 173 ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్ నమోదు చేయడానికి అవకాశాన్ని ఇస్తుంది. అయితే, ఈ ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ను నమోదు చేయడానికి మూడు రోజులలోపు అటువంటి సమాచారం ఇచ్చే వ్యక్తి సంతకాన్ని తీసుకోవాలి. ఈ నిబంధన బాధిత మహిళలకు పెద్ద ఊరటనిస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది వారికి సున్నితమైన కేసులు నమోదు  చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వారి ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్ నమోదు చేసేటప్పుడు వారి కష్టాలు పునరావృతం కాకుండా ఇది వారికి సహాయపడుతుంది. ఈ విషయంలో హోం వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, బిల్లు సమీక్ష నివేదికలో,  ఎఫ్ఐఆర్ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ నమోదును  అనుమతించడం వల్ల కలిగే సానుకూల ప్రభావాన్ని గుర్తించడం కూడా గమనించవచ్చు. అయితే, అదే సమయంలో అటువంటి  ఆన్‌‌‌‌‌‌‌‌లైన్/ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ను రాష్ట్రం పేర్కొన్న మోడ్‌‌‌‌‌‌‌‌ల ద్వారా మాత్రమే అనుమతించాలని కూడా కమిటీ అభిప్రాయపడింది. నియంత్రణ లేకుండా వదిలేస్తే, అది పోలీసులకు సాంకేతికంగా సవాలుగా ఉంటుంది. ఈ విధంగా దాఖలు చేసిన బహుళ ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌లను ట్రాక్ చేయడం, నిర్వహించడం కూడా కష్టం. దీని ప్రకారం కమిటీ తన నివేదికలో, ఎలక్ట్రానిక్ ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్ నమోదు కోసం నిర్దిష్ట పద్ధతులను సూచించే అధికారాన్ని ప్రభుత్వానికి మంజూరు చేయడానికి ‘ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్’ తర్వాత ‘నిబంధనల ద్వారా పేర్కొన్నవిధంగా’ అని ఉంచాలని  సిఫార్సు చేసింది. అయితే, బీఎన్​ఎస్​ఎస్​ బిల్లు, లోక్‌‌‌‌‌‌‌‌సభలో  ప్రవేశపెట్టడంతోపాటు రాష్ట్రపతి ఆమోదం కూడా పొందింది, ఇప్పుడు ‘నిబంధనల ద్వారా పేర్కొన్న విధంగా’ చేర్చే అవకాశం లేదు.

ALSO READ : ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి : తేజస్ నందలాల్ పవార్

ప్రాథమిక విచారణ

బీఎన్​ఎస్​ఎస్​ సెక్షన్ 173 (3) ప్రకారం మూడు సంవత్సరాలు లేదా ఏడేండ్లలోపు శిక్ష విధించే అవకాశం ఉన్న కేసులకు ప్రాథమిక విచారణ చేయడానికి చట్టబద్ధమైన గుర్తింపును ఇచ్చింది. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి కంటే తక్కువ కాని అధికారి నుంచి ముందస్తు అనుమతితో ప్రాథమిక విచారణ జరపవచ్చు. పద్నాలుగు రోజుల వ్యవధిలో ఈ ప్రాథమిక విచారణని పూర్తి చేయాల్సి ఉంటుంది.  అయితే, అప్పటికే  ప్రాథమికంగా కేసు ఉన్న సందర్భాల్లో అధికారి దర్యాప్తును కొనసాగించాల్సి ఉంటుంది. అందిన సమాచారంలో కాగ్నిజబుల్ నేరం బహిర్గతం అయితే ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్ నమోదు తప్పనిసరి అని సుప్రీంకోర్టు లలితాకుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసులో నిర్ద్వంద్వంగా పేర్కొంది. అయితే,  కొత్త నిబంధన ప్రకారం ప్రాథమిక విచారణను నిర్వహించే పరిమితి ప్రాథమిక కేసు. లలితా కుమారి కేసు ప్రకారం ప్రాథమిక విచారణ చేయగల కేసుల వర్గం ఈ విధంగా ఉన్నది. (ఎ) వైవాహిక వివాదాలు/ కుటుంబ వివాదాలు. (బి) వాణిజ్య నేరాలు. 
(సి) వైద్యపరమైన నిర్లక్ష్యం కేసులు.
 (డి) అవినీతి కేసులు. (ఇ) క్రిమినల్ ప్రాసిక్యూషన్ ప్రారంభించడంలో అసాధారణ జాప్యం/పొరపాట్లు ఉన్న కేసులు. ఉదాహరణకు, ఆలస్యానికి గల కారణాలను సంతృప్తికరంగా వివరించకుండా విషయాన్ని నివేదించడంలో 3 నెలలకు పైగా ఆలస్యం. కాగా, కొన్ని విషయాలకు కొత్త చట్టం చట్టబద్ధత కల్పించింది. ఈ కొత్త నిబంధనల్లో మంచీ, చెడు రెండూ ఉన్నాయి. 

-డా.మంగారి రాజేందర్, జిల్లా జడ్టి(రిటైర్డ్)