ముషీరాబాద్, వెలుగు: అందరూ ఒకచోట చేరి కార్తీక దీపాలు వెలిగించడం ఏకత్వాన్ని సూచిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. తెలుగు నేలపై కార్తీకమాసంలో కోటి దీపోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న కోటి దీపోత్సవంలో గురువారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు.
మహాశివునికి కార్తీక దీపం వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. హారతి ఇచ్చారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ ప్రతి కార్యక్రమాన్ని దీపాలు వెలిగించి ప్రారంభించడం మన సంప్రదాయమన్నారు. ఇక్కడ నిర్వహించిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కల్యాణం, పూరీ జగన్నాథుని కల్యాణంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.