![కులం, మతం, భాష కంటే.. భారతీయుడు అనే గుర్తింపే చాలా గొప్పది](https://static.v6velugu.com/uploads/2023/08/President-Droupadi-Murmu-in-her-Independence-Day-address_Wt9P7u8SoL.jpg)
న్యూఢిల్లీ: మువ్వన్నెల జెండా చూస్తూ హృదయం ఉప్పొగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రపంచంలో భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని, ప్రతి ఇండియన్ ప్రజాస్వామ్యం ముందు సమానమేనన్నారు. ప్రతి భారతీయుడికి కులం, మతం, భాష వంటి అనేక గుర్తింపులు ఉంటాయని, కానీ, భారతీయుడు అనే గుర్తింపు చాలా గొప్పదని పేర్కొన్నారు. ఈ భూమిలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు, హక్కులు, విధులు ఉన్నాయన్నారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడారు.
ఆర్థిక సాధికారతతోనే మహిళలు తమ కుటుంబం, సమాజంలో వారి స్థానాన్ని బలోపేతం చేస్తుందన్నారు. ప్రతి రంగంలోనూ మహిళలు దేశ అభివృద్ధికి సహకరిస్తూ, దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారని చెప్పారు. దేశంలోని అక్కాచెల్లెల్లకు సెల్యూట్ చెబుతున్నానని రాష్ట్రపతి అన్నారు. ఆధునిక కాలంలో మహిళలు తమ ప్రత్యేకతను నిలుపుకుంటూ చాలా రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా మహిళా ఫ్రీడమ్ ఫైటర్స్ మాతంగి హజ్రా, కనక్లటా బారుహా, కస్తూర్భా గాంధీ, సరోజినీ నాయుడు, అమ్ము స్వామినాథన్, రమాదేవి, అరుణ అసఫ్ అలీ, సుచేతా కృపాలాణిను గుర్తు చేసుకున్నారు. వీరు దేశానికి, సమాజానికి సేవ చేసేందుకు భవిష్యత్ తరాల మహిళలకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు.
ధైర్యంగా ముందుకు సాగాలె..
దేశంలో మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం సంతోషంగా ఉందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. మహిళల సాధికారత కోసం ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని దేశ ప్రజలను కోరారు. ‘‘నా అక్కా చెల్లెళ్లు, కూతుళ్లు సవాళ్లను ఎదుర్కొని, జీవితంలో ధైర్యంగా ముందుకు సాగండి. ఇండియా ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది. పురాతన కాలం నుంచి అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్య సంస్థలు పనిచేస్తున్నాయి. వలస పాలన వల్ల అవి తుడిచిపెట్టుకుపోయాయి. దేశ నాగరికతను తిరిగి పొందడంలో గాంధీ, ఇతర లీడర్లు సహాయపడ్డారు. సత్యం, అహింసలు దేశానికి మూలస్తంభాలుగా కొనసాగుతున్నాయి” అని రాష్ట్రపతి పేర్కొన్నారు.
జాతీయ విద్యా విధానం 2020.. ‘విజనరీ పాలసీ’అని ముర్ము కొనియాడారు. విద్యారంగంలో మార్పులను తీసుకొస్తుందని పేర్కొన్నారు. స్టార్టప్‌ల నుంచి గేమ్స్ వరకు మన దేశ యువత కొత్త కొత్త శిఖరాలను అధిగమిస్తోందని అన్నారు. ప్రపంచ వేదికపై ఇండియా తన స్థానాన్ని పెంచుకుంటోందని రాష్ట్రపతి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధితో పాటు మానవతా లక్ష్యాలను ప్రోత్సహించడంలో కీలకంగా వ్యవహరిస్తోందన్నారు. జీ20 అంతర్జాతీయ ఫోరమ్‌ల అధ్యక్ష బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిందని చెప్పారు. ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపగల సామర్థ్యం సాధించిందని రాష్ట్రపతి ముర్ము తెలిపారు.