నేవీలోకి వింధ్యగిరి యుద్ధనౌక.. కోల్​కతాలో ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము

కోల్‌‌కతా: దేశీయంగా తయారైన అత్యాధునిక స్టెల్త్ యుద్ధనౌక ‘వింధ్యగిరి’ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. గురువారం కోల్‌‌కతాలోని హుగ్లీ నది వద్ద ఇండియన్ నేవీలోకి ప్రవేశపెట్టారు. గార్డెన్ రీచ్ షిప్‌‌యార్డ్స్‌‌ రూపొందించిన ‘వింధ్యగిరి’.. నౌకల నిర్మాణం భారతదేశం స్వావలంబనకు చిహ్నమని ఆమె అన్నారు. ఈ అధునాతన యుద్ధనౌక నిర్మాణం.. ఆత్మనిర్భర్ భారత్‌‌కు, దేశం సాధించిన సాంకేతిక పురోగతికి ప్రతీక అని చెప్పారు. ‘‘వింధ్యగిరిని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. భారతదేశ సముద్ర సామర్థ్యాలను పెంపొందించడంలో, స్వదేశీ నౌకల నిర్మాణం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో ‘వింధ్యగిరి’ ఓ ముందడుగు” అని అన్నారు. ఇండియన్ నేవీకి, షిప్ నిర్మాణం, డిజైన్‌‌లో భాగమైన ప్రతిఒక్కరికీ ముర్ము అభినందనలు తెలిపారు. ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచిన ‘వింధ్య’ శ్రేణులను గుర్తుచేసేలా ఓడకు సరైన పేరు పెట్టారని ముర్ము చెప్పారు. ‘‘ఇండియా.. ఇప్పుడు ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. మూడో అతిపెద్ద ఎకానమీగా అవతరించేందుకు అడుగులు వేస్తున్నాం. ఎనానమీ వృద్ధి చెందుతున్నది అంటే.. అక్కడ భారీ వాణిజ్యం జరుగుతున్నదని అర్థం. సముద్రం మీదుగా భారీ స్థాయిలో మన సరుకు రవాణా జరుగుతున్నది. మన అభివృద్ధి, శ్రేయస్సుకు సముద్రాలు ఎంత ముఖ్యమనేది ఇవి తెలియజేస్తున్నాయి” అని వివరించారు. 

ముప్పు ఎటునుంచి వచ్చినా..

నేవీ కోసం ‘ప్రాజెక్ట్ 17 అల్ఫా’ పేరుతో  నిర్మించిన ఏడు నౌకల్లో ఇది ఆరోది. గతంలో 2019 నుంచి 2022 మధ్య ఐదు షిప్‌‌లను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ప్రాజెక్ట్ 17ఏ నౌకలన్నింటికీ గైడెడ్ మిసైళ్లను కలిగి ఉన్నాయి. ఒక్కో షిప్ 149 పొడవు ఉంటుంది. 6,670 టన్నుల బరువుతో 28 నాట్స్ వేగంతో వెళ్తుంది. గాలి, నీరు, ఉపరితలం నుంచి ఎదురయ్యే ముప్పులను ఛేదించే సామర్థ్యం దీనికి ఉంది.