సుప్రీం కొత్త సీజేఐ సంజీవ్ ఖన్నా.. నవంబర్ 11న ప్రమాణ స్వీకారం

సుప్రీం కొత్త సీజేఐ సంజీవ్ ఖన్నా.. నవంబర్ 11న ప్రమాణ స్వీకారం

ఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు స్వీకరించనున్నారు. నవంబర్ 11న సుప్రీం నూతన సీజేఐగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ విషయాన్ని న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ‘ఎక్స్’ వేదికగా అధికారికంగా వెల్లడించారు. నూతన సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను నియమించాలనే ప్రతిపాదనకు గురువారం నాడు (అక్టోబర్ 24, 2024) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.

జస్టిస్ డీవై చంద్రచూడ్ తర్వాత జస్టిస్ సంజీవ్ ఖన్నా సీనియర్గా ఉన్నారు. అందుకే ఆయన పేరును కేంద్రానికి సిఫార్సు చేశారు. ఆ తర్వాత లేఖ న్యాయ మంత్రిత్వ శాఖ వద్దకు.. అటు నుంచి పరిశీలన కోసం ప్రధానమంత్రికి వెళ్లింది. ఆయన ఆమోదించడంతో లేఖ రాష్ట్రపతి వద్దకు వెళ్లింది. రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో తదుపరి ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు.

నవంబర్ 10తో సీజేఐ డీవై చంద్రచూడ్ పదవీ కాలం ముగియనున్నది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 51వ సీజేఐగా జస్టిస్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వచ్చే ఏడాది మే 13న పదవీ విరమణ చేస్తారు. కాగా, జస్టిస్‌‌‌‌ డీవై చంద్రచూడ్ 2022 నవంబర్ 9న సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టు జడ్జిలు 65 ఏండ్ల వయస్సులో పదవీ విరమణ చేస్తారు.

జస్టిస్ సంజీవ్ ఖన్నా..సుప్రీం కోర్టు జడ్జిగా కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్, జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ బెయిల్ వంటి కేసుల్లో రాజ్యాంగ ధర్మాసనంలో ఒకరుగా ఉన్నారు. నిబంధనల ప్రకారం.. సీజేఐ పదవీ విరమణ తర్వాత సుప్రీం కోర్టులో ఉన్న సీనియర్ జడ్జిని ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నుకుంటారు.