నీట్ దోషులను శిక్షిస్తం.. హై లెవల్ ఎంక్వైరీ జరుగుతున్నది: రాష్ట్రపతి ముర్ము

నీట్ దోషులను శిక్షిస్తం.. హై లెవల్ ఎంక్వైరీ జరుగుతున్నది: రాష్ట్రపతి ముర్ము
  •    ఎమర్జెన్సీ.. దేశ చరిత్రలో చీకటి అధ్యాయం
  •     అది రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడి 
  •     అగ్రి, డిఫెన్స్ సెక్టార్ మరింత బలోపేతం చేస్తం
  •     ఉభయ సభలనుద్దేశించి ప్రసంగం

ఆర్థికంగా ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఆర్థిక వ్యవస్థ పరంగా 2014లో ప్రపంచంలో ఇండియా 11వ స్థానంలో ఉండేది. ఇప్పుడు ఐదో ప్లేస్​కు వచ్చింది. మ్యానుఫాక్చరింగ్, సర్వీసెస్, అగ్రికల్చర్ సెక్టార్​కు ఈక్వల్ ప్రయారిటీ ఇస్తున్నది. ప్రతీ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ అమలు దిశగా వేగంగా ముందుకెళ్తున్నది. ఉభయ సభల్లో ప్రతి అంశంపై చర్చ జరగాలి. దీనికి ప్రతిపక్షాలు సహకరించాలి. - రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్​లో అవకతవకలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ వ్యవహారంలో ఎన్డీయే ప్రభుత్వం.. హై లెవల్ ఎంక్వైరీ చేయిస్తున్నదని చెప్పారు. ఇలాంటి ఘటనల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం చేపట్టే నియామకాలు, పరీక్షల్లో పవిత్రత ఉండాలని అభిప్రాయపడ్డారు. నీట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు. 1975లో విధించిన ఎమర్జెన్సీ.. దేశ చరిత్రలో చీకటి అధ్యాయమని అన్నారు. 

అది రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడి అని అభివర్ణించారు. 18వ లోక్​సభ కొలువుదీరడంతో.. గురువారం ఉదయం పార్లమెంట్​కు వచ్చిన రాష్ట్రపతికి.. స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్​ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు స్వాగతం పలికారు. తర్వాత ఉభయ సభలను ఉద్దేశిస్తూ ఆమె మాట్లాడారు. ఎంపీలుగా ఎన్నికైన అందరికీ కంగ్రాట్స్ చెప్పారు. ఎగ్జామ్స్ నిర్వహిస్తున్న అన్ని సంస్థల్లో ప్రభుత్వం సంస్కరణలు తెచ్చేందుకు నిర్ణయించిందని తెలిపారు. ‘‘1975లో విధించిన ఎమర్జెన్సీ కారణంగా దేశ ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటువంటి రాజ్యాంగ విరుద్ధ శక్తులపై దేశం విజయం సాధించింది. ప్రతీ చాలెంజ్​ను దీటుగా ఎదుర్కొంటూ దేశం ముందుకు వెళ్తున్నది’’ అని రాష్ట్రపతి అన్నారు. 

రాజ్యాంగాన్ని కేంద్రం గౌరవిస్తది

రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంతో గౌరవిస్తున్నదని రాష్ట్రపతి అన్నారు. ‘‘ఆర్థికంగా ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఆర్థిక వ్యవస్థ పరంగా 2014లో ప్రపంచంలో ఇండియా 11వ స్థానంలో ఉండేది. ఇప్పుడు ఐదో ప్లేస్​కు వచ్చింది. మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఇండియాను నిలిపేందుకు కేంద్రం కృషి చేస్తున్నది. మ్యానుఫాక్చరింగ్, సర్వీసెస్, అగ్రికల్చర్ సెక్టార్​లకు ఈక్వల్ ప్రయారిటీ ఇస్తున్నది. ప్రతీ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ అమలు దిశగా వేగంగా ముందుకెళ్తున్నది. ఉభయ సభలు సజావుగా సాగాల్సిన అవసరం ఉంది. ప్రతి అంశంపై చర్చ జరగాలి. దీనికి ప్రతిపక్షాలు సహకరించాలి’’ అని రాష్ట్రపతి కోరారు. 

సీఏఏ కింద అర్హులకు సిటిజన్​షిప్

సీఏఏ కింద అర్హులైన వారందరికీ ఇండియన్ సిటిజన్ షిప్ ఇస్తున్నామని రాష్ట్రపతి చెప్పారు. వీరందరికి మంచి ఫ్యూచర్ ఉంటుందన్నారు. జులై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి రానున్నాయన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి స్థాపనకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. కాగా, రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ఉభయ సభలను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దీనికి ముందు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ లోక్​సభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. జైల్లో ఉన్న ఇద్దరు స్వతంత్రులతో పాటు మరో ఐదుగురు ఎంపీలు ఇంకా ప్రమాణం చేయాల్సి ఉంది. కాగా, రాష్ట్రపతి ప్రసంగంపై పార్లమెంట్​లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత దీనిపై చర్చలు ప్రారంభం అవుతాయి. సభ్యులు లేవనెత్తి అంశాలపై జులై 2న ప్రధాని మాట్లాడతారు. 

70 ఏండ్లు దాటినోళ్లందరికీ ఉచిత వైద్యం 

దేశంలో 70 ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ఫ్రీగా ట్రీట్​మెంట్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. గతకొన్ని దశాబ్దాలుగా ఈవీఎంలపై ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. చివరికి సుప్రీంకోర్టుతో పాటు ప్రజాకోర్టులోనూ ఈవీఎంలు పాస్ అయ్యాయని తెలిపారు. ‘‘జమ్మూకాశ్మీర్​లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. జమ్మూ కాశ్మీర్​పై కొందరు అంతర్జాతీయ వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారు. వారందరికీ ఓటుతో కాశ్మీర్ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. ఇది ఎంతో మంచి పరిణామం. సమర్థవంతమైన ఇండియా కోసం.. మన సాయుధ బలగాలకు అత్యాధునిక ఆయుధాలు అందజేయాల్సిన అవసరం ఉంది. యుద్ధాన్ని ఎదుర్కోవడంలో మనం సిద్ధంగా ఉండాలి. సాయుధ దళాల్లో సంస్కరణలు నిరంతరం కొనసాగాలి’’ అని అన్నారు. దివ్యాంగుల కోసం కేంద్ర ప్రభుత్వం సహాయ పరికరాలను అభివృద్ధి చేస్తున్నదని తెలిపారు. కార్మికుల కోసం సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ తెస్తున్నదన్నారు. కేంద్ర పథకాల కారణంగానే గత పదేండ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని రాష్ట్రపతి పేర్కొన్నారు. 

ప్రసంగాన్ని బహిష్కరించిన ఆప్  

లిక్కర్​ స్కామ్​లో ఆప్ చీఫ్​ కేజ్రీవాల్​ అరెస్ట్​ను నిరసిస్తూ ఆ పార్టీ ఎంపీలు రాష్ట్రపతి స్పీచ్ ను బాయ్​కాట్ చేశారు. రాష్ట్రపతి అంటే తమకు గౌరవం ఉందని, కానీ.. కేంద్ర ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగం కావడంతో బహిష్కరిస్తున్నట్టు చెప్పారు. పార్లమెంట్ బయట ఆప్ ఎంపీలంతా కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. దర్యాప్తు సంస్థల ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాగా, జాతీయ గీతం ప్లే అవుతున్నప్పుడు స్పీకర్ ఓం బిర్లా అటు.. ఇటు తిరిగారని ఆప్ ఎంపీలు ఫైర్ అయ్యారు. ఇలా చేయడం జాతీయ గీతాన్ని అవమానించినట్టేనని విమర్శించారు.