న్యూఢిల్లీ : అవినీతిపరులపై సత్వర చట్టపరమైన చర్యలు చాలా ముఖ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. జాప్యం లేదా బలహీనమైన చర్యలు అవినీతిపరులను ప్రోత్సహిస్తాయని ఆమె పేర్కొన్నారు. అయితే, ప్రతి చర్యను, వ్యక్తిని అనుమానంతో చూడకూడదని, దీనిని నివారించాలని ఆమె సూచించారు. వ్యక్తి గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని, ఏ చర్యను దురుద్దేశంతో ప్రేరేపించకూడదని, సమాజంలో న్యాయం, సమానత్వం నెలకొల్పడమే ఏ చర్యకైనా లక్ష్యం అని ఆమె అన్నారు.
శుక్రవారం ఢిల్లీలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన విజిలెన్స్ అవగాహన వారోత్సవాల కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎమ్‌ఎల్‌ఏ) కింద గత పదేండ్లలో 12 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్టు చెప్పారు. నమ్మకమే సామాజిక జీవితానికి పునాది అని, ఐక్యతకు మూలమని ముర్ము అన్నారు. "ప్రభుత్వ పనులు, సంక్షేమ పథకాలపై ప్రజల విశ్వాసమే పాలనకు మూలం. అవినీతి ఆర్థిక పురోగతికి అవరోధం మాత్రమే కాదు.. ఇది సమాజంపై నమ్మకాన్ని కూడా తగ్గిస్తుంది.
ప్రజలలో సోదర భావాలను ప్రభావితం చేస్తుంది. దేశ ఐక్యత, సమగ్రతపై కూడా ప్రభావం చూపుతుంది" అని రాష్ట్రపతి అన్నారు. ప్రతి సంవత్సరం అక్టోబరు 31న సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా.. "దేశ ఐక్యత, సమగ్రతను చెక్కుచెదరకుండా ఉంచడానికి మనం ప్రతిజ్ఞ చేద్దామని ఆమె సూచించారు. ఇది కేవలం ఆచారం మాత్రమే కాదని, ఇది సీరియస్‌గా తీసుకోవాల్సిన ప్రతిజ్ఞ అని అన్నారు. దాన్ని నెరవేర్చాల్సిన సమిష్టి బాధ్యత కూడా మనందరిపైనా ఉందన్నారు.
ఏ పనైనా సరైన స్ఫూర్తితో, దృఢ సంకల్పంతో చేస్తే విజయం ఖాయమని ముర్ము అన్నారు. "కొంతమంది అపరిశుభ్రతను మన దేశ విధిగా భావించారు. కానీ, బలమైన నాయకత్వం, రాజకీయ సంకల్పం, పౌరుల సహకారం పరిశుభ్రత రంగంలో మంచి ఫలితాలు తెచ్చాయి. అదేవిధంగా, అవినీతి నిర్మూలన అసాధ్యంగా భావించడం కొంత మంది నిరాశావాద వైఖరి. ఇది సరైనది కాదు" అని రాష్ట్రపతి పేర్కొన్నారు.