మన సంస్కృతిని కాపాడుకుందాం .. ఉన్నత దేశంగా భారత్​ను నిలుపుదాం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

మన సంస్కృతిని కాపాడుకుందాం .. ఉన్నత దేశంగా భారత్​ను నిలుపుదాం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
  • సమాజాన్ని చీల్చేందుకు కుట్రలు
  • అప్రమత్తంగా ఉంటూ కలిసి ముందుకు సాగాలి
  • బానిస మనస్తత్వం నుంచి బయటపడాలి
  • అందులో భాగంగానే న్యాయ చట్టాల్లో మార్పులు తెచ్చినట్లు వెల్లడి
  • గచ్చిబౌలిలో ‘లోక్​మంథన్​ భాగ్యనగర్​ 2024’ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత సమాజాన్ని చీల్చడానికి, ఏకత్వ లక్షణాన్ని విచ్ఛిన్నం చేయడానికి  కుట్రలు జరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండి ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. హైదరాబాద్​ గచ్చిబౌలిలోని శిల్పకళా వేదికలో ‘లోక్​మంథన్ భాగ్యనగర్ 2024’ కార్యక్రమాన్ని శుక్రవారం రాష్ట్రపతి ప్రారంభించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ... దేశాన్ని చాలా ఏండ్లు విదేశీయులు పాలించారని, ఈ సమయంలో ఆ సామ్రాజ్యవాద శక్తులు భారత ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టడంతో పాటు ఇక్కడి సామాజిక స్థితిగతులను కూడా ఛిన్నాభిన్నం చేశాయన్నారు. ‘‘మన సంస్కృతిని బ్రిటిష్ పాలకులు చులకన భావంతో చూసేవారు. మనలో కూడా అలాంటి భావం వచ్చేలా కుట్రలు చేశారు. బ్రిటిష్  పాలన వల్ల మన మెదళ్లలో వలసవాద బుద్ధే ఆక్రమించింది. భారత్​ను ఉన్నతమైన దేశంగా నిర్మాణం చేసేందుకు, మన ప్రజల మానసిక ప్రవర్తనను మార్చి వారిని ఏకత్వం వైపు తీసుకుపోవాల్సిన కర్తవ్యం అందరిపై ఉంది” అని సూచించారు. కొన్నేండ్లుగా బానిసత్వ మనస్తత్వం నుంచి బయటపడేందుకు దేశంలో కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీంట్లో భాగంగా భారత న్యాయ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చామని, ఢిల్లీలోని రాజ్ పథ్ పేరును తొలగించి కర్తవ్య పథ్ గా మార్చామని గుర్తు చేశారు. 

రాష్ట్రపతి భవన్ లో ఉండే దర్బార్ హాల్​ పేరును కూడా గణతంత్ర మండపంగా మార్చుకున్నామని తెలిపారు. న్యాయవ్యవస్థలో న్యాయదేవత కండ్లకు ఉండే వస్త్రాన్ని తొలగించి, మార్పులు చేశారని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతి అని.. అందులో ఏకత్వం ముఖ్యమైన సారమని తెలిపారు. 2018 లో రాంచీ వేదికగా జరిగిన లోక్ మంథన్ లో కూడా తాను పాల్గొన్నానని, ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. 

మన దేశసంస్కృతి, సంప్రదాయాలను అర్థం చేసుకోవడంలో, మన పరంపరను ఎప్పటికప్పుడు మరింత పరిపుష్టం చేయడంలో అందరూ తమ వంతు పాత్రను పోషించాలని ఆమె పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో అహల్యాబాయి హోల్కర్, రుద్రమదేవి లాంటి వీరనారీమణుల జీవిత చరిత్రల నాటకాలు ప్రదర్శించడం గొప్పవిషయమని, వీరనారీమణుల పోరాటం యువతకు ఆదర్శమని తెలిపారు. 

ఇది జాతీయ ఐక్యతకు కుంభమేళా: కిషన్​రెడ్డి

లోక్ మంథన్ ‘దేశమే అన్నింటికన్నా శ్రేష్ఠం’ అనే భావనతో పనిచేస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ సమావేశాల్లో భారతీయ పరంపర, సంస్కృతి, కళలు, ఆదివాసీల జీవనవిధానం, జ్ఞాన-విజ్ఞాన సంపద, పర్యావరణ పరిరక్షణ ఇలా అన్ని అంశాలపై చర్చించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఇది జాతీయవాదం, జాతీయ ఐక్యతకు సంబంధించిన కుంభమేళా లాంటిదని పేర్కొన్నారు. ఇక్కడ జరిగే చర్చల ద్వారా దేశ భవిష్యత్తుకు సరైన సమాధానం లభిస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు. గిరిజనుల జీవన విధానం  మనకెన్నో పరిష్కారాలను సూచిస్తుందని పేర్కొన్నారు. 

హైదరాబాద్​.. మినీ ఇండియా: సీతక్క

హైదరాబాద్ భిన్న సంస్కృతుల, భిన్న జీవన విధా నాల సమ్మేళనమని.. ఇది మినీ ఇండియా అని మంత్రి సీతక్క అన్నారు. దేశాన్ని ప్రపంచంలో అత్యున్నత దేశంగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసి పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో ఆర్ఎస్​ఎస్​ చీఫ్ మోహన్ భగవత్, ప్రజ్ఞా ప్రవాహ్ ప్రధాన కార్యదర్శి నందకుమార్, ప్రజ్ఞా భారతి చైర్మన్ టి.హనుమాన్ చౌదరి, కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
తదితరులు పాల్గొన్నారు.

దేశ సమైక్యతను ముందుకు తీసుకెళ్లాలి: గవర్నర్​

అనేక కుట్రలను తట్టుకొని నిలబడిన గొప్ప సంస్కృతి  మన దేశానిదని గవర్నర్​ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. దేశ సమైక్యతను ముందుకు తీసుకెళ్లడంలో ఈశాన్య రాష్ట్రాలతో పాటు ప్రతి రాష్ట్రం కీలకపాత్ర పోషిస్తున్నదని తెలిపారు. విదేశీ కుట్రలు తట్టుకుని నిలబడిన మనం.. ఐకమత్యంతో, సామరస్యంతో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.