శ్రీలంకకు కొత్త ప్రధాని

మహిందను తప్పించేందుకు ఒప్పుకున్న గోటబయ రాజపక్స

కొలంబో : శ్రీలంకలో నెలకొన్న సంక్షోభానికి ముగింపు పలికేందుకు ప్రెసిడెంట్ గోటబయ రాజపక్స కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘‘తన అన్న, ప్రస్తుత ప్రధాని మహింద రాజపక్సను పదవి నుంచి తొలగించేందుకు గోటబయ ఒప్పుకున్నారు. కొత్త పీఎంను, అన్ని పార్టీలతో కూడిన కొత్త కేబినెట్‌‌ను నేషనల్ కౌన్సిల్ నియమిస్తుందని చెప్పారు” అని మాజీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత మైత్రిపాల సిరిసేన వెల్లడించారు. శుక్రవారం ఉదయం సిరిసేనతో కూడిన ప్రతినిధుల బృందం ప్రెసిడెంట్ రాజపక్సను కలిసింది. మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. ఈ భేటీ తర్వాత సిరిసేన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రతిపాదిత మధ్యంతర ప్రభుత్వంలో తన అన్న మహింద రాజపక్స స్థానంలో కొత్త వ్యక్తిని ప్రధానిగా నియమించేందుకు గోటబయ రాజపక్స అంగీకారం తెలిపారు. దేశంలో ఆర్థిక సంక్షోభం కారణంగా ఏర్పడిన రాజకీయ ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు” అని వివరించారు.

ప్రతిపక్షాలతో చర్చించండి.. మెజారిటీ చూపండి
శ్రీలంక పొడుజన పెరమున (ఎస్‌‌ఎల్‌‌పీపీ) సంకీర్ణ ప్రభుత్వంలోని అసమ్మతి వర్గం.. మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేస్తున్నది. ఈ నేపథ్యంలో శుక్రవారం రెండు వర్గాలతో ప్రెసిడెంట్ గోటబయ రాజపక్స చర్చించారు. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 113 మంది ఎంపీల మద్దతును పొందడం ద్వారా మెజారిటీని చూపించాలని వారికి గోటబయ సూచించారు.