ఇమిగ్రెంట్లకు యూఎస్ పౌరసత్వం

  • లీగల్ స్టేటస్ లేకున్నా ఇవ్వాలని ప్రెసిడెంట్ బైడెన్ నిర్ణయం
  • పదేండ్లు యూఎస్ లోనే ఉండి, అక్కడి పౌరులను పెండ్లి చేసుకున్నోళ్లకు వర్తింపు 
  • ఎన్నికల ఏడాదిలో 5 లక్షల మంది ఇమిగ్రెంట్లకు ఊరట  

వాషింగ్టన్ : అమెరికాలో లీగల్ స్టేటస్ లేకుండా ఉంటున్న 5 లక్షల మంది ఇమిగ్రెంట్లకు ప్రెసిడెంట్ జో బైడెన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. పదేండ్లుగా అమెరికాలోనే ఉంటూ, అమెరికన్ పౌరులను పెండ్లి చేసుకున్న వాళ్లకు పౌరసత్వం ఇవ్వనున్నట్టు వైట్ హస్ మంగళవారం ప్రకటించింది. దీంతో ఎన్నికల ఏడాదిలో అమెరికాలోని లక్షలాది మంది ఇమిగ్రెంట్లకు భారీ ఊరట లభించనుంది.

అయితే, ఈ ఏడాది జూన్ 17 తర్వాత పదేండ్ల నివాస కాలం పూర్తి చేసుకునేవాళ్లకు, యూఎస్ సిటిజన్స్ ను పెండ్లి చేసుకునే వాళ్లకు మాత్రం ఈ స్కీం వర్తించబోదని వైట్ హౌస్ స్పష్టం చేసింది. అర్హతలు ఉన్నవాళ్లు అప్లై చేసుకునేందుకు రాబోయే కొద్ది నెలల్లో అవకాశం కల్పిస్తామని తెలిపింది. అప్లికేషన్లు ఆమోదం పొందిన తర్వాత మూడేండ్లలో గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చని పేర్కొంది.

అర్హత ఉండి, అప్లికేషన్ చేసుకున్నోళ్లకు టెంపరరీ వర్క్ పర్మిట్ జారీ చేస్తారని, దీంతో డిపోర్టేషన్ నుంచి రక్షణ ఉంటుందని వివరించింది. అలాగే, అమెరికాలో లీగల్ స్టేటస్ లేని పిల్లలు(పేరెంట్స్ లో ఒకరు మాత్రమే అమెరికా సిటిజన్ అయి ఉంటే) కూడా పౌరసత్వం కోసం అప్లై చేసుకోవచ్చని వైట్ హౌస్ అధికారులు తెలిపారు. అయితే, పెండ్లి ఎప్పుడు అయిందన్నది ముఖ్యం కాదని, పదేండ్లు అమెరికాలో నివసించి ఉండాలన్నదే కంపల్సరి అని పేర్కొన్నారు.

కాగా, ఈ నెల మొదట్లో బార్డర్ లో అక్రమ వలసలపై బైడెన్ సర్కారు విరుచుకుపడటంతో ఎన్నికల ఏడాది ఇలా చేయడమేంటని సొంత పార్టీ డెమోక్రటిక్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో ఇమిగ్రెంట్లకు ఊరటనిచ్చేలా సర్కారు కొత్త ప్లాన్ తో ముందుకొచ్చింది.