తిరుపతి: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎవ్వరైనా పోటీ చేయొచ్చని ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ఆంధ్రుడు కానటువంటి వాళ్లు పోటీ చేయొద్దని ఎవరూ చెప్పలేదన్నారు. ఎలక్షన్ రోజు సీసీటీవీ ఫుటేజీ కావాలంటూ ప్రకాశ్ రాజ్ కోరడంపై విష్ణు స్పందిస్తూ.. ఎవరైనా సీసీటీవీ చూసుకోవచ్చని, ఎటువంటి ఇబ్బంది లేదన్నారు.
‘ఎన్నికల్లో గెలుపోటములు సర్వసాధారణం. గెలిచింది మేమే. అన్నీ బహిరంగంగానే జరిగాయి. పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేయకముందే తాను గెలిచానని ప్రకాష్ రాజ్ చెప్పుకున్నారు. పవన్ కల్యాణ్, మేం ఫ్యామిలీ ఫ్రెండ్స్. మేం ఇద్దరమూ స్టేజ్ఎక్కకముందు చాలాసేపు మాట్లాడుకున్నాం. చిరంజీవి, మోహన్ బాబు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. వచ్చే ఎలక్షన్‌లో ప్రకాష్ రాజ్ పోటీ చేయొచ్చు. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌లో గెలుపొందిన సభ్యులు రాజీనామాలు చేసినట్లు మీడియా ద్వారానే నాకు తెలిసింది. మాకు ఒక్కటే రాజీనామా వచ్చింది. మేం చాలా వరకు బైలాస్‌ను మారుస్తాం. రెండు వారాల్లో ఇతర భాషల ఇండస్ట్రీల్లోని బైలాస్‌ను చదివి కొత్తగా రూపొందిస్తాం. పెద్దలు, జనరల్ బాడీతో మీటింగ్ పెట్టి చర్చిస్తాం’ అని విష్ణు చెప్పారు.
పవన్ మద్దతు కావాలె
‘ఆన్‌లైన్ టికెట్ల విధానాన్ని సమర్థిస్తున్నా. మమ్మల్ని నిలదీసే హక్కు ‘మా’లోని ప్రతి సభ్యుడికి ఉంటుంది. నాకు రాజకీయాలపై పెద్దగా నాలెడ్జ్ లేదు. పవన్ ఓ పెద్ద స్టార్. ఆయన సపోర్ట్ మాకు కావాలి. ‘మా’ మన తల్లి, జాగ్రత్తగా చూసుకో విష్ణు అని ఆయన నాకు చెప్పారు. మా నాన్న కోపం అందరికీ తెలుసు. పోలింగ్ జరిగిన రెండ్రోజుల తర్వాత తమపై దాడి జరిగిందని చెప్పడం విడ్డూరం. సీసీటీవీ ఫుటేజీలను చూసుకోవచ్చు. ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందుల గురించి ఇరు రాష్ట్రాల సీఎంలను కలసి వివరిస్తాం’ అని విష్ణు పేర్కొన్నారు.