గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్​గా ఇండియాను మారుస్తం: ద్రౌపది ముర్ము

గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్​గా ఇండియాను మారుస్తం: ద్రౌపది ముర్ము
  • ‘గగన్​యాన్’ ఎంతో దూరంలో లేదు: ద్రౌపది ముర్ము
  • వక్ఫ్, జమిలి బిల్లులతో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నం
  • అభివృద్ధిలో దూసుకుపోతున్నం.. బడ్జెట్​లో పేదలకు ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడి
  • పార్లమెంట్​ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

న్యూఢిల్లీ, వెలుగు:  ఇండియాను గ్లోబల్‌‌ ఇన్నోవేషన్‌‌ పవర్‌‌హౌస్‌‌గా మారుస్తామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టార్​లో ‘ఇండియా ఏఐ మిషన్’ను ప్రారంభించామని తెలిపారు. విద్యారంగంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. సైబర్‌‌ సెక్యూరిటీలో సమర్థత కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, డిజిటల్‌‌ మోసాలు, సైబర్‌‌ నేరాలు, డీప్‌‌ఫేక్‌‌ వంటివి సామాజిక, ఆర్థిక, దేశ భద్రతకు పెను సవాళ్లుగా మారాయని తెలిపారు. పార్లమెంట్‌‌ బడ్జెట్‌‌ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడారు. సభ ప్రారంభంలో ప్రయాగ్‌‌రాజ్‌‌లోని మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఇటీవలే తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్‌‌ సింగ్‌‌కు శ్రద్ధాంజలి ఘటించారు. ‘‘గగన్​యాన్ ప్రయోగం ఎంతో దూరంలో లేదు. స్పోర్ట్స్ నుంచి స్పేస్ వరకు అన్ని రంగాల్లో ఇండియా దూసుకుపోతున్నది. ఎంఎస్‌‌ఎంఈలకు క్రెడిట్‌‌ గ్యారంటీ పథకాలు, ఈ -కామర్స్‌‌ ఎగుమతి కేంద్రాలు దేశంలో అన్ని రంగాల్లో వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఒకే దేశం – ఒకే ఎన్నిక, వక్ఫ్‌‌ సవరణ బిల్లు అమలు దిశగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాం. ప్రపంచంలోనే ఇండియాను మూడో ఆర్థిక శక్తిగా నిలుపుతాం. దేశాభివృద్ధి ఫలాలు అందరికీ అందించడమే లక్ష్యం’’ అని ద్రౌపది ముర్ము అన్నారు. 

హోమ్ లోన్లపై సబ్సిడీ ఇస్తున్నం

మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కారు.. అభివృద్ధిలో మూడు రెట్ల వేగంతో దూసుకుపోతున్నదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ‘‘3 కోట్ల మంది పేద కుటుంబాలకు ఇండ్లు నిర్మిస్తున్నాం. పేద, మధ్య తరగతి ప్రజలకు హోమ్‌‌ లోన్‌‌ సబ్సిడీ ఇస్తున్నాం. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చినం. రూ.70 వేల కోట్లతో గ్రామీణ రోడ్లు అభివృద్ధి చేస్తున్నాం. ట్యాక్స్ పాలసీలను సరళీకరించాం. ఆయుష్మాన్‌‌ భారత్‌‌ పథకం కింద.. 6 కోట్ల మంది వృద్ధులకు ఆరోగ్య బీమా అందిస్తున్నాం. అమృత్ భారత్‌‌, నమో భారత్‌‌ రైళ్లు ప్రవేశపెడుతున్నాం. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లతో గొప్ప ముందడుగు పడింది. యువతకు ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాం’’ అని రాష్ట్రపతి ముర్ము తెలిపారు. బడ్జెట్‌‌లో రైతులు, మహిళలు, పేదలు, యువతకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. 

80శాతం రాయితీతో మందులు

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రం కృషి చేస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.12 వేల కోట్లు కేటాయించామ‌‌ని తెలిపారు. ‘‘దేశంలో కార్పొరేట్‌‌ సంస్థలకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. ఒలింపిక్‌‌ పతకాలు సాధిస్తూ దేశం గర్వించేలా చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో డిజిటల్‌‌ సేవల కల్పనలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. మధ్య తరగతి ప్రజల కలలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం. ఉడాన్ స్కీమ్ కింద దాదాపు 1.50 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. జన్ ఔషధి కేంద్రాల ద్వారా 80% రాయితీపై మందులు అందిస్తున్నాం. రూ.30 వేల కోట్లకు పైగా ఆదా చేశాం. రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు సాగు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర అందిస్తున్నాం. కచ్చితమైన వాతావరణ సమాచారాన్ని అందించేందుకు రూ.2,000 కోట్లతో ‘మిషన్‌‌ మౌసం’ను ప్రారంభించాం. సహకార రంగంలో అనేక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం’’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.    
    
ఇయ్యాల్నే బడ్జెట్.. సభలో ప్రవేశపెట్టనున్న మంత్రి నిర్మల

2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్​ను.. శనివారం ఉదయం 11 గంటలకు లోక్​సభలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. దాదాపు రెండు గంటల పాటు బడ్జెట్ ప్రసంగం కొనసాగుతుందని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. ఈసారి పేద, మధ్య తరగతి ప్రజలు, రైతులు, మహిళలు, యువతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. ఉద్యోగులకు ట్యాక్స్ కటాఫ్​లో బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు. రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై లోక్ సభలో ఈ నెల 3, 4వ తేదీల్లో చర్చ జరగనున్నది. 4వ తేదీన సాయంత్రం లోక్‌‌సభలో ఈ తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం ఇస్తారు. 6, 7, 10, 11వ తేదీల్లో బడ్జెట్ పై చర్చ ఉంటుంది. 11వ తేదీన బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ మాట్లాడుతారు.