- నేషనల్ స్పేస్ డే వేడుకల్లో రాష్ట్రపతి
న్యూఢిల్లీ: మనం అంతరిక్ష రంగంలో ఎంతో ప్రగతి సాధించామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇస్రో అద్భుత విజయాలు సాధించిందని కొనియాడారు. తక్కువ వనరులు ఉన్నప్పటికీ, సైంటిస్టులు కష్టపడి ప్రపంచవ్యాప్తంగా మన దేశ సత్తాను చాటారని ప్రశంసించారు. స్పేస్ సెక్టార్లో భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఢిల్లీలోని భారత్ మండపంలో తొలి నేషనల్ స్పేస్ డే వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడారు. 2030 నాటి కల్లా డెబ్రిస్ ఫ్రీ మిషన్స్ చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకోవడం అభినందనీయమన్నారు. ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ.. ‘మేం పోయినేడాది చంద్రయాన్–3ను విజయవంతంగా ప్రయోగించాం. అయితే, దాని ప్రభావం ఇంతలా ఉంటుందని ఊహించలేదు. చంద్రయాన్–3ని ప్రయోగించిన ఆగస్టు 23ను నేషనల్ స్పేస్ డేగా ప్రధాని మోదీ ప్రకటించారు’ అని పేర్కొన్నారు. కాగా, స్పేస్ సెక్టార్‌ను మరింత అభివృద్ధి చేస్తామని ప్రధాని మోదీ అన్నారు. నేషనల్ స్పేస్ డే సందర్భంగా దేశ ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.