- ధనికులతో సమానంగా అందట్లేదు: రాష్ట్రపతి ముర్ము
- ఆర్థిక వ్యత్యాసంతో పేదలకు న్యాయ నిరాకరణ సరికాదు
- మహిళలపై అత్యాచారాల కట్టడికి నేషనల్ నెట్‌వర్క్ ఉండాలి
- దాని ఏర్పాటుకు నల్సార్ వర్సిటీ ముందుకు రావాలి
- అడ్వకేట్లు క్లయింట్ల ప్రయోజనాలను కాపాడాలని వ్యాఖ్య
- నల్సార్ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవానికి హాజరు
హైదరాబాద్, వెలుగు: న్యాయంలోనూ పేదలకు అన్యాయం జరుగుతోందని, ధనికులతో సమానంగా న్యాయం అందట్లేదని రాష్ట్రపతిద్రౌపది ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ సమన్యాయం అందించాలని రాజ్యాంగం నిర్దేశించిందని.. కానీ, దేశంలో మాత్రం ధనవంతులకు లభించినట్టు పేదవారికి లభించడం లేదని ఆమె అన్నారు. ఆర్థిక వ్యత్యాసం కారణంగా పేదలకు న్యాయ నిరాకరణ సరికాదని.. దురదృష్టకరమైన ఈ అనుచిత పరిస్థితులకు ముగింపు పలకాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. నల్సార్ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవం శామీర్‌పేటలోని వర్సిటీ ప్రాంగణంలో శనివారం జరిగింది.
ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. అందరికీ సమ న్యాయం అందించేందుకు యువ అడ్వొకేట్లు ప్రయత్నించాలని సూచించారు. మహిళలపై అత్యాచారాల కట్టడికి నేషనల్ లెవల్‌లో ఒక నెట్‌వర్క్ ఏర్పాటు చేసే దిశగా నల్సార్ చర్యలు తీసుకోవాలని కోరారు. నల్సార్ ఓల్డ్ స్టూడెంట్స్ సహా అన్ని వర్గాల మద్దతు కూడగట్టి.. దేశవ్యాప్తంగా మహిళా అడ్వొకేట్స్, లా స్టూడెంట్స్‌తో నెట్ వర్క్ ఏర్పాటు చేసేందుకు సాయం చేయాలని పిలుపునిచ్చారు. మహిళలపై జరిగే అఘాయిత్యాల కేసులను పరిష్కరించడానికి సంఘటితంగా పనిచేయాలన్నారు. అలాగే, నల్సార్‌లో యానిమల్ లా సెంటర్ ఏర్పాటును రాష్ట్రపతి అభినందించారు. 20 ఏండ్ల కిందట ఒడిశాలో మత్స్య, జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా జంతు రక్షణ, సంక్షేమం గురించి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు బాగా ప్రయత్నాలు చేసినట్టు తెలిపారు. మానవాళి శ్రేయస్సు కోసం జంతువులు, పక్షులు, చెట్లు, నీటి వనరుల పరిరక్షణకు యువత ప్రయత్నించాలన్నారు. ఇందుకు నల్సార్ యానిమల్ లా సెంటర్ అడుగులు వేసిందని కొనియాడారు.
లా స్టూడెంట్లు సాంకేతికతనూ అందిపుచ్చుకోవాలి
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ)పై నల్సార్ దృష్టిపెట్టడాన్ని ముందుచూపుగా రాష్ట్రపతి అభివర్ణించారు. ప్రపంచంలో న్యాయపరమైన అంశాలలోనూ ఏఐ బాగా ఉపయోగపడుతోందని చెప్పారు. భవిష్యత్ లీగల్ఎక్స్పర్ట్స్గా రాణించాలంటే లా స్టూడెంట్స్ సాంకేతికతనూ అందిపుచ్చుకోవాలని ప్రెసిడెంట్ సూచించారు. చారిత్రక భారతదేశంలో న్యాయపరమైన పునాదులు ఉన్నాయని ఆమె తెలిపారు. చట్టపరమైన కీలక సూచనలలో ఒకటైన అపస్తంబ సూత్రం ఇదే దక్కన్ పీఠభూమిలో లిఖితమైందన్నారు. గాంధీ తొలి సత్యగ్రహ ఉద్యమం చంపారన్ వద్ద చేసినప్పుడు తన న్యాయవాద ప్రతిభను చాటుకున్నారన్నారు. భారతదేశ అత్యున్నత న్యాయ సంప్రదాయాలను నేటి యువతకు వివరించేందుకే ఈ చారిత్రక విషయాలు తెలియజేసినట్టు వివరించారు. అడ్వొకేట్లు తమ క్లయింట్ల ప్రయోజనాలను కాపాడాలని రాష్ట్రపతి సూచించారు.
చాలా మంది కార్పొరేట్ సంస్థలు, చట్టపరమైన సంస్థలలో న్యాయ సలహాదారులుగా చేరవచ్చని, న్యాయ ప్రామాణాలను కాపాడే విధంగా న్యాయ సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గోల్డ్ మెడల్స్ విజేతలుగా ఆడ పిల్లలే ఎక్కువగా ఉన్నారని.. కానీ, నల్సార్‌లో డిగ్రీలు పొందిన వారిలో మాత్రం ఆడ పిల్లలు తక్కువగా ఉన్నారని ఆమె చెప్పారు. మహిళా సాధికారిత సాధనకు అంతా కృషి చేయాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే స్నాతకోత్సవాలను ప్రారంభించారు. వైస్ చాన్స్‌లర్ కృష్ణదేవరావు స్వాగతం పలికారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నర్సింహ, సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. వీరంతా విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, పట్టాలను ప్రదానం చేశారు.
ములుగు మున్సిపాలిటీ బిల్లును ఆమోదించండి: సీతక్క
హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముతో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క శనివారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చే చట్టానికి ఆమోదం తెలపాలని రాష్ట్రపతికి ఆమె వినతిపత్రం సమర్పించారు. రెండేండ్లుగా రాష్ట్రపతి కార్యాలయంలో ములుగు మున్సిపాలిటీ బిల్లు పెండింగ్ లో ఉందని, బిల్లును ఆమోదిస్తే ములుగుకు మున్సిపాలిటీ హోదా దక్కుతుందని రాష్ట్రపతికి సీతక్క వివరించారు. బిల్లు క్లియర్ అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి.. హైదరాబాద్ చేరుకున్నప్పటి నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయ్యే వరకు మినిస్టర్ ఇన్ వెయిటింగ్ హోదాలో మంత్రి సీతక్క రాష్ట్రపతి వెంటే ఉన్నారు.
భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభించిన ముర్ము
ఎవరు ఏ స్థాయికి ఎదిగినా తమ మూలాలను మరిచిపోవద్దని మంత్రి సీతక్క పేర్కొన్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ కార్యక్రమన్ని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రారంభించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాల వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు. దేశంలో ఎన్నో కులాలు, ప్రాంతాలు, జాతులు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వమే భారత దేశానికి అసలైన బలమన్నారు. ఈశాన్య రాష్ట్రాల సంప్రదాయ నృత్యాలతో కళా మహోత్సవ కార్యక్రమం కొనసాగడం హర్షణీయమన్నారు. తెలంగాణ ఆదివాసీ బిడ్డగా ఆదివాసీ గిరిజనుల నృత్యాలు తనను కట్టిపడేస్తాయని, నృత్యాలను ఎంతగానో ఆస్వాదిస్తానని చెప్పారు. కాగా.. హైదరాబాద్ పర్యటన ముగిసిన అనంతరం ఢిల్లీ బయలుదేరిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకి బేగంపేట విమానాశ్రయంలో సీతక్క తెలంగాణ పల్లె సంస్కృతి ఉట్టిపడే పెయింటింగ్ ను బహూకరించారు. సీతక్కతో పాటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు.