నేడు భద్రాద్రికి రాష్ట్రపతి

భద్రాచలం/యాదగిరిగుట్ట/జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/వెంకటాపూర్‌‌‌‌(రామప్ప), వెలుగు: శీతాకాల విడిది కోసం రాష్ట్రానికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం భద్రాద్రి, రామప్ప ఆలయాలను సందర్శించనున్నారు. భద్రాద్రి శ్రీసీతారామ చంద్రస్వామిని, రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్​ స్కీం కింద మంజూరు చేసిన నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్రపతి భూమి పూజ చేస్తారు. రాష్ట్రపతి టూర్​ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. 

తొలుత భద్రాద్రి రాముని చెంతకు..

రాష్ట్రపతి ముందుగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తారు. అక్కడి నుంచి ఉదయం 10.10 గంటలకు భద్రాచలం పబ్లిక్ స్కూల్​కు హెలికాఫ్టర్​లో చేరుకుంటారు. 10.30 గంటలకు శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకుంటారు. తర్వాత ప్రసాద్​ స్కీం నిధులు రూ.41.38 కోట్లతో చేపట్టే పనులకు ఆమె భూమి పూజ చేస్తారు. అనంతరం వీరభద్ర ఫంక్షన్​ హాల్​లో జరిగే గిరిజన పూజారుల సమ్మేళనంలో పాల్గొంటారు. లంచ్​ తర్వాత మధ్యాహ్నం 1.35కు భద్రాద్రి నుంచి ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి వెళ్తారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో బుధవారం ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేశారు. భద్రతా కారణాలతో భద్రాచలం రామవారధిపై ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు రాకపోకలు నిషేధించారు. భద్రాచలం, సారపాకల్లో 144 సెక్షన్ విధించి స్కూళ్లకు సెలవు ప్రకటించారు. 

రామప్ప గుడి సందర్శన

భద్రాచలం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌‌‌‌లో మధ్యాహ్నం 2.20 గంటలకు రాష్ట్రపతి ముర్ము రామప్ప ఆలయానికి చేరుకుంటారు. హెలిప్యాడ్‌‌‌‌ నుంచి బ్యాటరీ కారులో రామప్ప టెంపుల్ ప్రధాన గేటు వద్దకు వస్తారు. ఆలయంలో రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం రూ.62 కోట్లతో ప్రసాద్‌‌‌‌ స్కీం కింద చేపట్టబోయే పనులను, రూ.15 కోట్లతో చేపట్టబోయే కామేశ్వర ఆలయ పున:నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. ఆ తర్వాత అక్కడే తన కోసం తయారు చేసిన గ్రీన్ హౌస్ లో రాష్ట్రపతి కాసేపు సేద తీరుతారు. రాష్ట్రపతి కోసం ప్రత్యేకంగా రెండు గిరిజన నృత్యాలను ప్రదర్శించనున్నారు. మధ్యాహ్నం 4 గంటలకు రాష్ట్రపతి తిరిగి హైదరాబాద్ కు బయలుదేరుతారు.

మూడంచెల భద్రత

భద్రాద్రి, రామప్పకు విచ్చేయనున్న రాష్ట్రపతి కోసం సెంట్రల్‌‌‌‌, స్టేట్‌‌‌‌ పోలీసులు మూడెంచల భద్రతా ఏర్పాట్లు చేశారు. పూజారులు, అతిథులు, ఆఫీసర్లు, సిబ్బంది, మీడియా ప్రతినిథులకు పాస్‌‌‌‌లు కేటాయించారు. పాసులున్న వారినే కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతిస్తారు. రాష్ట్రపతి తిరిగే ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ తో నిత్యం తనిఖీలు చేపడుతున్నారు. లోకల్‌‌‌‌ పోలీస్‌‌‌‌ ఆఫీసర్లను సమన్వయం చేసుకుంటూ పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా వేలాది మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

ఎల్లుండి యాదాద్రికి

రాష్ట్రపతి ముర్ము ఈ నెల 30న యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా కొండపైన, కింద ఏర్పాట్లు స్పీడ్ గా సాగుతున్నాయి. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో యాదగిరిగుట్ట రానుండటంతో యాగశాలలో మూడు హెలీప్యాడ్లను సిద్ధం చేస్తున్నారు. ఘాట్ రోడ్డు గుండా కాన్వాయ్ ద్వారా ఆమె కొండపైకి చేరుకోనున్నారు. దీంతో ఘాట్ రోడ్డు వెంట ఎల్ఈడీ లైట్లు, కొండపైన ఆర్సీసీ ర్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. తూర్పు రాజగోపురం నుంచి ప్రెసిడెంట్ కాలినడకన ఆలయంలోకి ప్రవేశించనున్నారు. ఇందుకోసం రెడ్ కార్పెట్ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రపతి టూర్ ఏర్పాట్లను మంగళవారం యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. మంగళవారం రాష్ట్రపతి భద్రతా సిబ్బంది, ఏవియేషన్ ఆఫీసర్లు మూడు ఆర్మీ హెలికాప్టర్లతో ట్రయల్స్ నిర్వహించారు.