భద్రాచలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్రపతి

భద్రాచలం/బూర్గంపాడు, వెలుగు: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఐటీసీ స్కూల్​లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్  వద్ద బుధవారం మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, కలెక్టర్​ అనుదీప్, ఎస్పీ వినీత్​ ఘనంగా స్వాగతం పలికారు. రాజమండ్రి నుంచి భారత వాయుసేన ప్రత్యేక హెలికాప్టర్​లో బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ బీపీఎల్  స్కూల్​లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు ఉదయం 10.53 గంటలకు వచ్చారు. అక్కడి నుంచి బయలుదేరి 11.10 కి శ్రీ సీతారామచంద్రస్వామి  దేవస్థానానికి చేరుకుని రూ.41.38 కోట్లతో చేపట్టనున్న పర్యాటక పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి 11.34 కి బయలు దేరి 11.52కి వీరభద్ర ఫంక్షన్ హాలుకు చేరుకున్నారు. అక్కడ సమ్మక్కసారలమ్మ పూజారుల సమ్మేళనంలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 12.45కు బయలుదేరి ఐటీసీ గెస్ట్​ హౌస్​కు చేరుకున్నారు. ఐటీసీలో భోజనం చేశాక 1.47కు బయలుదేరి ఐటీసీ స్కూల్​లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుని 2 గంటలకు బయలుదేరి ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి బయలుదేరారు. రాష్ట్రపతి వెంట కుమార్తె ఇతిస్త్రీ ముర్ము రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

భారీ బందోబస్తు..

రాష్ట్రపతి హోదాలో దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము భద్రాచలం రాక సందర్భంగా కేంద్ర, రాష్ట్ర బలగాలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ , సత్యవతి రాథోడ్ లు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ఆమె వెంట గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉన్నారు. దేవాలయంలో వేద పండితులు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు. రాష్ట్రపతి రాక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీపీఎల్  క్రాస్ రోడ్  నుంచి భద్రాచలం వైపు వాహనాల రాకపోకలను నిలిపేశారు. భద్రాచలంలో వాహనాలను దారి మళ్లించారు. కలెక్టర్ అనుదీప్, ఎస్పీ డా.వినీత్, ఏఎస్పీ రోహిత్ రాజ్  ఇతర భద్రతా అధికారులు ఏర్పాట్లను, బందోబస్తును పర్యవేక్షించారు. 144 సెక్షన్​ విధించడంతో పాటు రాష్ట్రపతి కాన్వాయ్​ వచ్చే మార్గంలో సీఆర్పీఎఫ్​ 141 బెటాలియన్​ వజ్ర బుల్లెట్ ప్రూఫ్​ వాహనం గస్తీ నిర్వహించింది. కూనవరం రోడ్డులోని అన్నిప్రాంతాల్లో బాంబు, డాగ్ స్వ్కాడ్​లు తనిఖీలు నిర్వహించారు. హైవే పైకి వచ్చే మార్గాలన్నింటిని బారికేడ్​లతో మూసివేశారు. 350 మంది ఆఫీసర్లతో పాటు 2000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత  నిర్వహించారు.

రామయ్య దర్శనానికి జనం పాట్లు

రాష్ట్రపతి భద్రాచలం పర్యటన సందర్భంగా ఆంక్షలు విధించడంతో కొందరు భక్తులు ఇబ్బంది పడ్డారు. తమిళనాడు రాష్ట్రం సేలం నుంచి రాజేంద్రన్ కుటుంబం శ్రీసీతారామచంద్రస్వామి దర్శనానికి వచ్చింది. బుధవారం ఉదయం 8 గంటలకు ఆలయానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. 11.30 గంటల తర్వాత మాత్రమే దర్శనం ఉంటుందని వెనక్కి పంపించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు రామవారధిపై రాకపోకలు నిషేధించడంతో సాయంత్రం 5 గంటలకే విజయవాడ నుంచి ట్రైన్​ రిజర్వేషన్​ ఉండటంతో దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగారు. బ్రిడ్జి వద్ద పోలీసులు ఆపేయడంతో, తన సమస్యను పోలీసులకు వివరించాడు. పోలీసులు తమ వాహనంలో వారిని రామవారధి దాటించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.