
చెన్నై: నీట్ పరీక్ష విషయంలో స్టాలిన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడును నీట్ నుంచి మినహాయించాలని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. ఈ విషయాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్ శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. "2021, 2022లో రెండుసార్లు నీట్ నుంచి మినహాయింపు బిల్లును తమిళనాడు శాసనసభ ఆమోదించింది.
ఈ బిల్లును ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. అవసరమైన అన్ని వివరణలు ఇచ్చినా నీట్ నుంచి మినహాయింపును కేంద్రం తిరస్కరించింది. ఇది సమాఖ్య విధానంలో చీకటి దశ. తమిళనాడును కేంద్రం అవమానించింది. అయినా, నీట్ కు వ్యతిరేకంగా మా పోరాటాన్ని కొనసాగిస్తం. కేంద్ర నిర్ణయాన్ని సవాలు చేసేందుకు చట్టబద్ధమైన మార్గాలను అన్వేషిస్తాం. న్యాయ నిపుణులతో చర్చిస్తాం. తదుపరి చర్యల్లో భాగంగా ఏప్రిల్ 9న శాసనసభ్యులందరితో సమావేశం నిర్వహిస్తాం" అని స్టాలిన్ ప్రకటించారు.