భారతీయ కళామహోత్సవ్ ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాలకు వారధి

భారతీయ కళామహోత్సవ్ ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాలకు వారధి
  • సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలి
  • రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు 
  • బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఉత్సవాలు ప్రారంభం

కంటోన్మెంట్, వెలుగు: దేశంలోని సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక వైవిధ్యం, జానపద నృత్యాలు, సంగీతం, కళ, సంప్రదాయ వస్త్రధారణ దేశ వారసత్వమన్నారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల సహకారంతో మొదటిసారి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన ‘భారతీయ కళా మహోత్సవ్’ను శనివారం ఆమె ప్రారంభించారు. ఈ ఉత్సవాలు ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, జీవన శైలి, ఆచార వ్యవహారాలను తెలియజేస్తామని రాష్ట్రపతి చెప్పారు. ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాలకు వారధిగా నిలుస్తాయని, సాంస్కృతిక మార్పిడిని పెంపొందిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా నిలయంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను రాష్ట్రపతి సందర్శించారు. కళాకారులతో ఆడిపాడారు. కార్యక్రమంలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పలువురు గవర్నర్లు, మంత్రులు, రాష్ట్ర గవర్నర్ ​జిష్ణుదేవ్​వర్మ, మంత్రి సీతక్క, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఎనిమిది రోజులు ఉత్సవాలు

రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన భారతీయ కళా మహోత్సవ్ అక్టోబరు 6 వరకు కొనసాగనుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర నుంచి దాదాపు 300 మంది ఆర్టీజన్స్​పాల్గొంటున్నారు. వారి చేతివృత్తుల ఉత్పత్తులను ప్రదర్శనకు పెట్టారు. 400 మంది కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 వరకు సందర్శకులను ఫ్రీగా అనుమతిస్తారు.  visit.rashtrapatibhavan.gov.in వెబ్​సైట్ లో వివరాలు నమోదు చేసుకుని ఫ్రీ ఎంట్రీ పాస్ పొందవచ్చు. లేదా నేరుగా రాష్ట్రపతి నిలయం వద్ద ఏర్పాటు చేసిన కియోస్క్ వద్ద పాస్​తీసుకోవచ్చు.