ఇవాళ హైదరాబాద్​కు రాష్ట్రపతి ముర్ము

ఇవాళ హైదరాబాద్​కు రాష్ట్రపతి ముర్ము

 

  • రేపు లోక్​మంతన్ ప్రోగ్రామ్​కు హాజరు
  • వివిధ దేశాల ప్రతినిధులతో భేటీ
  • మధ్యాహ్నం తిరిగి ఢిల్లీకి పయనం

సికింద్రాబాద్/మాదాపూర్, వెలుగు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గురువారం సాయంత్రం 6 గంటలకు బేగంపేట ఎయిర్​పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 7.10 గంటలకు రాజ్​భవన్ చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. శిల్పారామం వేదికగా గురువారం నుంచి 24వ తేదీ వరకు లోక్​మంతన్ కార్యక్రమం జరగనున్నది. గురువారం ప్రతినిధులు రిజిస్ట్రేషన్​ చేసుకుంటారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు లోక్​మంతన్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా వివిధ దేశాల ప్రతినిధులతో ఆమె భేటీ అవుతారు. మధ్యాహ్నం 12.05 గంటలకు బేగంపేట ఎయిర్​పోర్టు నుంచి ప్రత్యేక సైనిక విమానంలో తిరిగి ఢిల్లీ వెళ్లిపోతారు. అయితే, గురువారం సాయంత్రం హైదరాబాద్​కు చేరుకున్నాక ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవంలో ఆమె పాల్గొననున్నారు. రాష్ట్రపతి పర్యటన సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. ప్రొటోకాల్ పాటించాలని, ట్రాఫిక్​తో పాటు భద్రతకు సంబంధించిన వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసు శాఖకు సూచించారు.

ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు

మాదాపూర్ లోని శిల్పకళా వేదికగా గురువారం ప్రారంభమయ్యే లోక్ మంతన్ కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శేరిలింగంపల్లి తహసీల్దార్ వెంకా రెడ్డి, మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్, ఇంటలిజెన్స్ అధికారులు బుధవారం శిల్పకళా వేదికలో ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ సంస్కృతి, సంప్రదాయాలను ఏకతాటిపైకి తేవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని లోక్ మంతన్ కమిటీ సభ్యుడు రాజశేఖర్ తెలిపారు. ఈ ప్రోగ్రామ్​కు 120 దేశాల నుంచి 1,500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.