- మాదిగ హక్కుల దండోరా అధ్యక్షుడు సునీల్
లక్సెట్టిపేట, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకే మాదిగ, మాదిగ ఉప కులాల సంపూర్ణ మద్దతు ఉంటుందని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ స్పష్టం చేశారు. ఆదివారం లక్సెట్టిపేటలోని గురునానక్ గార్డెన్స్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లెదర్ పార్క్ పునర్నిర్మాణంతోపాటు మాదిగ, ఉప కులాలు గర్వపడేలా ప్రతి నియోజకవర్గంలో మాదిగ భవనాల నిర్మాణానికి చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వంశీకృష్ణ స్పష్టమైన హామీ ఇచ్చారని తెలిపారు.
ఈ రెండు హామీలు నెరవేరాలంటే వంశీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. లెదర్ పార్క్ పునర్నిర్మాణం జరిగితే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. గతంలోనే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత కాకా ఫ్యామిలీకి ఉందని పేర్కొన్నారు. దండోరా రాష్ట్ర కార్యదర్శి కలాల రమేశ్ మాదిగ మాట్లాడుతూ.. వంశీకృష్ణ అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించే నాయకుడని కొనియాడారు. ఆయన గెలుపు కోసంవాడవాడలో ప్రచారం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎంహెచ్ డీ నాయకులు తగరపు సత్తయ్య మాదిగ, తాండ్ర లింగన్న, జిల్లా సంతోష్, లింగంపల్లి సుధాకర్, చొప్పదండి రమేశ్, సమ్మయ్య, భూమన్న, నవీన్, వరప్రసాద్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.