
జన్నారం, వెలుగు : ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి వివిధ కారణలతో చనిపోయిన కార్మికుల ఫ్యామిలీలను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి దుబాయి శాఖ ప్రెసిడెంట్ అలీం కోరారు. ఇటీవల గల్ఫ్‌లో చనిపోయిన మండలంలోని కవ్వాల్‌కు చెందిన కార్మికుడి ఫ్యామిలీకి గురువారం ఆర్థికసాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన అనేక మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అందుకు తగ్గట్టుగా రూ.500 కోట్లతో బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు అమరగొండ తిరుపతిగౌడ్, నాయకులు మగ్గిడి తిరుపతి, పరకాల మహేశ్‌గౌడ్, దుమ్మళ్ల ఎల్లయ్య, అంజి, రాజలింగు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.