బీసీ రిజర్వేషన్లు పెంచి చట్టబద్ధత కల్పించాలి : ఆర్.కృష్ణయ్య

ఆమనగల్లు, వెలుగు: ప్రధాని మోడీ బీసీ సామాజికవర్గానికి చెందిన వాడైనా బీసీలకు చేసిందేమి లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య విమర్శించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్  మండలం మైసిగండి గ్రామంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బీసీ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్​ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు విద్యలో 50 శాతం, ఉద్యోగాల్లో 56 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. 

రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అన్నిరంగాల్లో అన్యాయం చేస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి బీసీ వ్యతిరేక విధానాన్ని విడనాడాలని సూచించారు. స్థానిక సంస్థల్లో జనాభా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్  చేశారు. గతంలో కేసీఆర్  ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని, దీంతో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్  తన సొంత బలంతో అధికారంలోకి రాలేదనే విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చిన ప్రభుత్వాలు బీసీలకు ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం బీసీలు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైనదని, ఉద్యమాన్ని అణచి వేయాలని ప్రభుత్వం చూస్తే రాష్ట్రం రణరంగంగా మారుతుందని హెచ్చరించారు.