టాటా మృతిపై రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల సంతాపం..

టాటా మృతిపై రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల సంతాపం..

పారిశ్రామిక దిగ్గజం, అత్యున్నత వ్యక్తిత్వం గల మానవతావాది రతన్ టాటా ఇక లేరు. ఇటీవల బీపీ లెవెల్స్ పడిపోవటంతో హాస్పిటల్ లో  చేరిన టాటా బుధవారం ( అక్టోబర్ 10, 2024 ) ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. తుదిశ్వాస వరకు దేశమే ముఖ్యమని నమ్మిన గొప్ప మానవతావాది మరణం భారతావనిని శోక సంద్రంలో ముంచేసింది. తుదిశ్వాస వరకు స్ఫూర్తిదాయకంగా జీవించిన రతన్ జీ మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Also Read :- రతన్ టాటా చివరి రోజుల్లో అన్ని తానై

టాటా మృతి పట్ల ప్రముఖుల సంతాపం:

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము:

టాటా మృతిపై ఎక్స్ ద్వారా స్పందించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రతన్ టాటా మరణం విచారకరమని.. కార్పొరేట్ వృద్ధితో పాటు, నైతికతతో దేశ నిర్మాణానికి పాటుపడ్డ ఐకాన్ ను దేశం కోల్పోయిందని అన్నారు. కాలేజీ కుర్రాళ్ళ నుండి వ్యాపార దిగ్గజాల వరకు ఆయన ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు. టాటా కుటుంబ సభ్యులకు, టాటా గ్రూప్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు ద్రౌపది ముర్ము.

 

ప్రధాని మోడీ:

టాటా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ప్రధాని మోడీ ఇలా ట్వీట్ చేశారు:  రతన్ టాటా దూరదృష్టి గల వ్యాపార దిగ్గజమని..  దయాహృదయం, అసాధారణమైన వ్యక్తి అని అన్నారు. టాటా ప్రతిష్టాత్మకమైన వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారని..  సమాజాన్ని మెరుగుపరచడంలో ఆయనకున్న అచంచలమైన నిబద్దత స్ఫూర్తిదాయకమని ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.

 

రాహుల్ గాంధీ: 

రతన్ టాటా విజన్ కలిగిన వ్యక్తి అని..  వ్యాపారం, దాతృత్వం రెండింటిలోనూ చెరగని ముద్ర వేశారంటూ ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ.

సీఎం రేవంత్ రెడ్డి: 

రతన్ టాటా మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రతన్ టాటా, భారతదేశపు గొప్ప పారిశ్రామికవేత్తలలో ఒకరని.. భారతదేశ కార్పొరేట్ ప్రపంచంలో దూరదృష్టి గల, మానవతావాదమున్న మహోన్నత వ్యక్తి అని.. టాటా జీవితం వినయం విజయంతో కూడిన అసాధారణ ప్రయాణమని అన్నారు. టాటా కుటుంబానికి, ఈ అపారమైన నష్టానికి సంతాపం వ్యక్తం చేస్తున్న అసంఖ్యాక భారతీయులకు నా హృదయపూర్వక సానుభూతి... శ్రీ రతన్ టాటా అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయంటూ ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

సీఎం చంద్రబాబు:

దార్శనికత చిత్తశుద్ధితో ఈ ప్రపంచంపై చిరస్థాయిగా ముద్ర వేసిన రతన్ టాటా వంటివారు కొందరే ఉంటారని... ఈ రోజు మనం కేవలం ఒక వ్యాపార టైటాన్‌నే కాకుండా.. నిజమైన మానవతావాదిని కోల్పోయామని, అతని వారసత్వం అతను తాకిన ప్రతి హృదయంలో ఉంటుందని.. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ.. ఆయన కుటుంబం, టాటా గ్రూప్‌కు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు.