ప్రభుత్వం 80 శాతం రైతులకు ప్రాధాన్యత

పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్  తెలంగాణ ఆలయ ప్రస్తావన తెచ్చారు. రామప్ప ఆలయం గురించి మాట్లాడారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తీసుకొచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. మొత్తం 52 నిముషాల పాటు సాగిన రాష్ట్రపతి ప్రసంగంలో  కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పలు పథకాలు, అభివృద్ధి పనులు గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా.. పురుషులకు మాదిరిగానే మహిళలకు పెళ్లి చేసుకునే కనీస వయస్సు 18 ఏళ్లు నుంచి 21 ఏళ్లకు పెంచేందుకు  ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టిందన్నారు.   జాతీయ విద్యా విధానంతో  ప్రాంతీయ భాషలకు ప్రాముఖ్యత లభిస్తుందన్నారు. ప్రాంతీయ భాషల్లో ముఖ్యమైన  ఎంట్రెన్స్ ఎగ్జామ్స్  నిర్వహించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు. 10 రాష్ట్రాల్లోని 19 ఇంజినీరింగ్ కాలేజీలు ఈ ఏడాది 6 ప్రాంతీయ భాషల్లో బోధించబోతున్నాయన్నారు.

వీధి వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేందుకు  కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వనిధి యోజనను కూడా అమలు చేస్తోందన్నారు. ఇప్పటివరకు 28 లక్షల మంది వీధి వ్యాపారులు రూ. 2900 కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని పొందారన్నారు.  ప్రభుత్వం  అంబేద్కర్ ఆదర్శాలను తన మార్గదర్శక సూత్రంగా పరిగణిస్తుందన్నారు ఆయుష్మాన్ భారత్ కార్డు పేదలకు లబ్ధి చేకూర్చిందన్నారు. జన్ ఔషధి కేంద్రంలో తక్కువ ధరలకు మందులు లభించడం కూడా గొప్ప విషయమన్నారు.  ప్రభుత్వం ఎప్పుడూ 80% చిన్న సన్నకారు రైతులకు ప్రాధాన్యతనిస్తుందన్నారు.  33 సైనిక్ స్కూల్స్ లో  అమ్మాయిలకు కూడా అడ్మిషన్ ప్రారంభించడం సంతోషకరమైన విషయమన్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA)లో మహిళా క్యాడెట్‌ల ప్రవేశానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. 2022 జూన్ లో తొలి బ్యాచ్ మహిళా క్యాడెట్లు ఎన్‌డిఎలోకి వస్తారన్నారు.