![President Rule: కేంద్రం సంచలన నిర్ణయం.. మణిపూర్లో రాష్ట్రపతి పాలన](https://static.v6velugu.com/uploads/2025/02/president-rule-imposed-in-manipur_7mQXUg9OF3.jpg)
బీజేపీ పాలిత రాష్ట్రం మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చెయ్యడంతో రాష్ట్రపతి పాలన దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. మైతేయి, కుకీ తెగల మధ్య జరుగుతున్న ఘర్షణల కారణంగా మణిపూర్ అట్టుడుకుతోంది. ఈ క్రమంలో సీఎం రాజీనామా చేశారు.
మణిపూర్ అల్లర్ల సందర్భంగా సీఎం బీరేన్ సింగ్ ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారని, ఒక వర్గాన్ని కావాలనే రెచ్చగొట్టి అల్లర్లకు మద్ధతు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో సొంత పార్టీ నేతలే ఆయనపై విమర్శలకు దిగారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే విశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉండటం.. సొంత పార్టీ నేతలు విప్ ధిక్కరించి వ్యతిరేకంగా ఓటు వేసే పరిస్థితులు ఉన్నందున.. పార్టీ అధిష్టానం సీఎం బీరేన్ సింగ్ తో రాజీనామా చేయించింది.
మణిపూర్ లో మే 2023 నుంచి అల్లర్లు జరుగుతున్నాయి. వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. అల్లర్లను నివారించడంలో విఫలమయ్యారనే విమర్శల నడుమ.. ఆదివారం (ఫిబ్రవరి 9 సీఎం రాజీనామా చేశారు. దీంతో తాజాగా రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
మే 2023 నుంచి మణిపూర్లో తీవ్రమైన హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. నవంబర్ 7న జిరిబామ్‌లోని జైరాన్ గ్రామంలో హ్మార్ తెగకు చెందిన ఒక మహిళ, ముగ్గురు పిల్లలను మైతేయి మిలిటెంట్లు హత్య చేయడంతో మణిపూర్లో మరోసారి అల్లర్లు తీవ్రరూపం దాల్చాయి. దీనికి ప్రతీకారంగా నవంబర్ 11న మైతేయి వర్గంపై కుకీ తీవ్రవాదులు ఎటాక్ చేశారు. అప్పట్నుంచి మణిపూర్ రావణకాష్టంలా మండుతూనే ఉంది. ప్రభుత్వం అల్లర్లను అదుపు చేయడంలో విఫలమైందని సొంత పార్టీ నేతలే తిరుగుబాటుకు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేయగా.. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన విధిస్తూ తాజాగా కేంద్రం నిర్ణయం తీసుకుంది.