టారిఫ్​ వార్​లో ఎవరూ గెలవరు.. ట్రంప్​కు చైనా ప్రెసిడెంట్​ జిన్​ పింగ్​ కౌంటర్​

టారిఫ్​ వార్​లో ఎవరూ గెలవరు.. ట్రంప్​కు చైనా ప్రెసిడెంట్​ జిన్​ పింగ్​ కౌంటర్​
  • మాపై పన్నులు పెంచితే అమెరికన్లకూ నష్టమే: ట్రూడో
  • కెనడా గవర్నర్ అంటూ ట్రూడోపై ట్రంప్ సెటైర్ 

వాషింగ్టన్/టొరాంటో/బీజింగ్: దేశాల మధ్య ‘టారిఫ్, ట్రేడ్, టెక్నాలజీ వార్స్’ జరిగితే విజేతలెవరూ ఉండరని చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ అన్నారు. అమెరికా టారిఫ్ లు పెంచితే గనక తాము తమ దేశ ప్రయోజనాలకు కట్టుబడి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. చైనా నుంచి ఫెంటనిల్ డ్రగ్ ను అమెరికాలోకి స్మగ్లింగ్ కాకుండా అడ్డుకోకపోతే ఆ దేశంపైనా సుంకాలు 10 శాతం పెంచుతామన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

మంగళవారం బీజింగ్​లో వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, డబ్ల్యూటీవో సహా పది అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో జిన్ పింగ్ మాట్లాడారు. అన్ని దేశాలు వాణిజ్యంలో సహకరించుకుంటూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి కృషి చేయాలన్నదే తమ విధానమని చెప్పారు.

మేం కూడా ప్రతిచర్యలు తీసుకుంటం: ట్రూడో

అమెరికాకు తమ దేశం నుంచి ఎగుమతి చేసే అన్ని వస్తువులపైనా సుంకాలను పెంచితే అమెరికన్లకు కూడా నష్టం జరుగుతుందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హెచ్చరించారు. చమురు, కరెంట్, మినరల్స్ వంటి అనేక అంశాల్లో అమెరికా తమపైనే ఆధారపడి ఉందన్న సంగతి మరిచిపోరాదన్నారు. అమెరికాలోకి అక్రమ వలసలు, డ్రగ్స్​ను కట్టడి చేయకపోతే కెనడా, మెక్సికో, చైనా దేశాల దిగుమతులపై సుంకాలు పెంచుతామంటూ యూఎస్ ప్రెసిడెంట్​గా ఎన్నికైన ట్రంప్ గత నెలలో చేసిన వ్యాఖ్యలపై ఆయా దేశాల అధినేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

తాజాగా టొరంటోలో ‘హాలిఫాక్స్ చాంబర్ ఆఫ్ కామర్స్’ కార్యక్రమంలో ట్రూడో మరోసారి స్పందించారు. ‘‘కెనడా నుంచి వెళ్లే ప్రతి వస్తువుపైనా టారిఫ్​లను 25% వరకూ పెంచుతామని ట్రంప్ అంటున్నారు. అలా చేస్తే కెనడా ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుంది. అదేసమయంలో అమెరికన్లకు వస్తువుల ధరలు కూడా భారీగా పెరుగుతాయి” అని ఆయన అన్నారు. ‘‘గతంలో మాపై టారిఫ్ లు పెంచినప్పుడు మేంకూడా ప్రతిచర్యగా టారిఫ్​లు పెంచాం. ఇప్పుడు కూడా ప్రతిచర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు.

ట్రూడోపై మళ్లీ ట్రంప్ సెటైర్ 

కెనడా ప్రధాని ట్రూడోపై ట్రంప్ మళ్లీ సెటైర్ వేశారు. ట్రూడోను కెనడా రాష్ట్ర గవర్నర్ అంటూ సంబోధించారు. గత నెలలో మార్ ఏ లాగో ఎస్టేట్​లో ట్రంప్​తో జరిగిన భేటీలో సుంకాలు పెంచితే తమ దేశానికి తీవ్ర నష్టం జరుగుతుందని ట్రూడో చెప్పగా.. కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా చేర్చితే సుంకాలూ ఉండవంటూ ట్రంప్ జోక్ చేశారు.

తాజాగా ట్రూడోపై మరోసారి సెటైర్ వేశారు. ‘‘కెనడా రాష్ట్ర గవర్నర్ ట్రూడోతో కలిసి గతవారం డిన్నర్ చేయడం సంతోషంగా ఉంది. గవర్నర్​ను త్వరలోనే మళ్లీ కలవాలని, సుంకాలు, వాణిజ్యంపై మరింత లోతైన చర్చలు జరపాలని కోరుకుంటున్నా. ఆ చర్చల ఫలితాలు అందరికీ సంతోషాన్ని కలిగిస్తాయి” అంటూ ట్రంప్ ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ పెట్టారు. 

ట్రంప్ టీంలోకి మరో ఇండియన్​ అమెరికన్

డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వంలోకి మరో ఇండియన్​అమెరికన్​ను తీసుకున్నారు. భారత సంతతికి చెందిన హర్మీత్ కె ధిల్లాన్‌‌‌‌ను న్యాయ శాఖలో పౌర హక్కుల కోసం అసిస్టెంట్ అటార్నీ జనరల్‌‌‌‌గా నామినేట్ చేశారు. ఈమేరకు ఆయన ట్రూత్ సోషల్ పోస్ట్‌‌‌‌లో వెల్లడించారు. ‘యూఎస్ డిపార్ట్‌‌‌‌మెంట్ ఆఫ్ జస్టిస్‌‌‌‌లో పౌర హక్కుల కోసం అసిస్టెంట్ అటార్నీ జనరల్‌‌‌‌గా హర్మీత్ ధిల్లాన్‌‌‌‌ను నామినేట్ చేయడం సంతోషంగా ఉంది.

ధిల్లాన్ దేశంలోని అగ్రశేణి అడ్వకేట్​లలో ఒకరు" అని ట్రంప్ చెప్పారు. చండీగఢ్‌‌‌‌లో జన్మించిన ధిల్లాన్ తన కుటుంబంతో చిన్నతనంలోనే యూఎస్‌‌‌‌కు వెళ్లారు. ఆమె డార్ట్‌‌‌‌మౌత్ కాలేజీ, వర్జీనియా వర్సిటీ నుంచి పట్టా అందుకున్నారు. 2006లో ధిల్లాన్ లా గ్రూప్ ఇంక్‌‌‌‌ను స్థాపించారు.